నేడు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం

నేడు బండి సంజయ్‌ అధ్యక్షతన చంపాపేటలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది. రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది. క్షేత్రస్థాయి నుంచి ప్రజలను ప్రభావితం చేసేందుకు పక్కా వ్యూహం చేపడుతుంది. ఇందులో భాగంగానే ప్రజా సంగ్రామ యాత్ర.. ఇప్పుడు జన సంపర్క్ యాత్ర వంటి కార్యక్రమాలు చేపడుతోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్​లో నేడు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది.

ఈ సమావేశానికి పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు లక్ష్మణ్‌, రాష్ట్ర ఇన్‌చార్జ్‌లు శివప్రకాశ్‌, తరున్‌ఛుగ్‌, సునీల్‌ బన్సల్‌, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఎంపీలు, ఎమ్మెల్యేలు సమావేశానికి హాజరుకానున్నారు. ప్రధాని మోడీ తొమ్మిదేళ్ల పాలన పూర్తవుతున్న సందర్భంగా చేపట్టనున్న కార్యక్రమాలు, రాబోయే ఎన్నికలు , బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలపై భేటీలో చర్చించనున్నారు. ఈ సమావేశం ఉదయం 11 గంటలకు చంపాపేటలోని సామా సరస్వతి కన్వెన్షన్ హాలులో జరగనుంది. ప్రస్తుతం తెలంగాణ బీజేపీ శ్రేణులు నైరాశ్యంలో ఉన్నారు. వాళ్లలో జోష్ ఎలా నింపాలి అనే అంశాన్ని ఈ మీటింగ్‌లో చర్చిస్తారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్‌చుగ్ ఏం చెబుతారన్నది ఆసక్తిగా మారింది.