కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన బిజెపి శ్రేణులు

తెలంగాణ రాష్ట్ర బిజెపి ఆఫీస్ వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేసారు బిజెపి శ్రేణులు. మొయినాబాద్ ఫాంహౌస్ ఘటన రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపుతోంది. రెండు పార్టీల మధ్య ఇప్పుడు చిచ్చు రాజేసింది. మునుగోడు ఉప ఎన్నిక వేళ ఈ ఘటన సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అధికార పార్టీ నేతలను బిజెపి డబ్బు తో కొనుగోలు చేసేందుకు ట్రై చేసిందని , ఈ తరుణంలో పోలీసులు వారిని ప్లాన్ ను బట్టబయలు చేసారని టిఆర్ఎస్ చెపుతుంది. అయితే ఇదంతా కూడా కేసీఆర్ డ్రామా అని బిజెపి అంటుంది. ఈ క్రమంలో గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముందు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ కమలం పార్టీ శ్రేణులు దగ్ధం చేశారు. బీజేపీ మైనార్టీ మోర్చా ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా బీజేపీ మైనారిటీ మోర్చా అధ్యక్షుడు అప్సర్ పాషా మాట్లాడుతూ… కేసీఆర్ డైరెక్షన్‌లో నిర్మాత సంతోష్ రావు , హరీష్ రావు ఆధ్వర్యంలో వచ్చిన మెగా సినిమా అట్టర్ ఫ్లాప్ అయిందని వ్యాఖ్యలు చేశారు. మునుగోడులో ఒడిపోతామని కేసీఆర్ పెద్ద డ్రామాకు తెర తీశారని ఆరోపించారు. ఎన్నికల్లో మళ్ళీ గెలవలేని గువ్వల బాలరాజు కు రూ.100కోట్లు ఇస్తామా అని ప్రశ్నించారు. జైలుకు వెళ్ళే వారి లిస్టులో నలుగురు ఎమ్మెల్యేల పేర్లు ఉన్నాయన్నారు. స్టీఫెన్ రవీంద్ర గురించి అందరికి తెలుసని అప్సర్ పాషా విమర్శలు గుప్పించారు.