బండి సంజయ్ అరెస్ట్ కు నిరసనగా 14 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భాజపా నిరసనలు

ఆదివారం (జనవరి 2) బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాత్రి కోవిడ్ ఆంక్షలకు విరుద్ధంగా జాగరణ దీక్ష చేపట్టడంతో పాటు పోలీస్ విధులను అడ్డుకోవడంతో బండి సంజయ్ పై పోలీసులు కేసు నమోదు చేసి కరీంనగర్ కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల పాటు రిమాండ్ కు తరలించాలని తీర్పు ఇచ్చింది. దీంతో ఆయన్ను కరీంనగర్ జైలు కు తరలించారు. ఈ క్రమంలో బండి సంజయ్ అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ భాజపా రాష్ట్ర వ్యాప్తంగా 14 రోజుల పాటు నిరసనలు చేయాలనీ పిలుపునిచ్చింది.

రేపటి నుంచి ఈ నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయని ఆ పార్టీ నాయకులు తెలిపారు. 14 రోజుల పాటు రాష్ట్ర నాయకులతో పాటు… రోజుకొక కేంద్ర మంత్రి కానీ… జాతీయ నాయకుడు కానీ ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొంటారని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి తెలిపారు. 317 జీవోను సవరించాలని, నిరుద్యోగ సమస్య పరిష్కారం కావాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించాలని నిరసన చేసిన వ్యక్తిపై అక్రమ కేసులు పెట్టడాన్ని వారు ఖండించారు. అక్రమ కేసులు పెట్టారు కాబట్టే… 14 రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు.రేపు భాజపా జాతీయ అధ్యక్షుడు నడ్డా హైదరాబాద్‌కు వస్తున్నారన్నారు. నిరసన కార్యక్రమాలను ఏ రోజుకు ఆరోజు వెల్లడిస్తామన్నారు.