రాజ్యసభకు లక్ష్మణ్​ నామినేషన్

లఖ్​నవూ : బీజేపీ ఓబీసీ జాతీయ మోర్చా అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా బరిలో దింపాలన్న పార్టీ అధిష్ఠానం నిర్ణయం మేరకు లఖ్​నవూ వెళ్లిన లక్ష్మణ్​.. నామినేషన్​ పత్రాలను ఎన్నికల అధికారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ పాల్గొన్నారు. నలుగురు పేర్లతో రాజ్యసభ అభ్యర్థుల జాబితాను పార్టీ అధిష్ఠానం.. సోమవారం రాత్రి విడుదల చేసింది. ఇందులో మధ్యప్రదేశ్ నుంచి సుమిత్ర వాల్మీకి, కర్ణాటక నుంచి లహర్ సింగ్ సరోయ, యూపీ నుంచి మిథిలేష్ కుమార్, కె.లక్ష్మణ్ పేర్లను ప్రకటించింది. ఎగువసభ స్థానానికి తెలంగాణ నుంచి లక్ష్మణ్​కు అవకాశం ఇవ్వటం పట్ల కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ బిడ్డకు తొలిసారి రాజ్యసభ సీటు ఇవ్వడం సంతోషం. లక్ష్మణ్‌కు రాజ్యసభ సీటిచ్చిన మోడీ, అమిత్‌షా, నడ్డాకు కృతజ్ఞతలు. లక్ష్మణ్ ఎంపీ అయ్యాక రాష్ట్రంలో బీజేపీ మరింత బలోపేతం అవనుంది అన్నారు.

కాగా, విద్యార్థి దశ నుంచే ఏబీవీపీలో కీలకంగా పని చేసిన లక్ష్మణ్‌ బీజేపీ ఆవిర్భావం నుంచి పార్టీలో పని చేస్తున్నారు. హైదరాబాద్‌ నగర కార్యదర్శిగా పని చేస్తూ అంచెలంచెలుగా ఎదిగారు. పీహెచ్‌డీ చేసిన లక్ష్మణ్‌ హిందీ, ఇంగ్లీషు భాషలలోనూ అనర్గళంగా మాట్లాడగలరు. ముషీరాబాద్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. బీజేపీ శాసనసభా పక్ష నేతగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. తెలంగాణలో బీజేపీ బలోపేతానికి విశేషంగా కృషి చేశారు. వచ్చే ఏడాది జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా.. కమలం పార్టీ అధిష్ఠానం వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. దిగువ సభలో తెలంగాణ నుంచి నలుగురు ఎంపీలు ఉండగా.. ఎగువసభలో రాష్ట్ర విషయాలు వచ్చినప్పుడు పార్టీ నుంచి మాట్లాడేవారు కరవయ్యారు. ఆ లోటును భర్తీ చేయడంతో పాటు.. తెలంగాణలోని బలమైన మున్నూరు కాపు, మొత్తం ఓబీసీ సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకునేందుకు.. బీజేపీ ఎత్తుగడ వేసినట్లు కనిపిస్తోంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/