కేసీఆర్ బీఆర్ఎస్‌ ప్రకటన ఫై బిజెపి రాజసభ సభ్యుడు లక్ష్మణ్‌ విమర్శలు

టిఆర్ఎస్ ను కాస్త బీఆర్ఎస్‌ గా మార్చేశారు పార్టీ అధినేత , తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. దసరా పర్వదినాన జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన టిఆర్ఎస్ సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు తీర్మానం పెట్టగా.. సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఇకపై టిఆర్ఎస్ ‘బీఆర్ఎస్ (భారత రాష్ట్ర సమితి )’ గా మారింది. కాగా బీఆర్ఎస్ ఫై బిజెపి నేతలు వారి స్టైల్ లో సెటైర్లు , విమర్శలు చేస్తున్నారు.

రాష్ట్రంలో టిఆర్ఎస్ కు నూకలు చెల్లాయని అందుకే బీఆర్ఎస్ పేరుతో మరో కొత్త డ్రామా చేస్తున్నారని బిజెపి రాజసభ సభ్యుడు లక్ష్మణ్‌ విమర్శించారు. ఎనిమిది ఏళ్ల పాలనలో తెలంగాణ ప్రజలకు కేసీఆర్​ చేసింది ఏంటో ముందు చెప్పాలని ప్రశ్నించారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణను అప్పులు పాలు చేశారని ఆయన ఆరోపించారు. మునుగోడు ఉప ఎన్నికల నుంచి రాష్ట్ర ప్రజలను మళ్లించే ఉద్దేశంతో కేసీఆర్ చేస్తున్న ఉపాయాలు ప్రజలకు అర్ధమవుతున్నాయని లక్ష్మణ్ పేర్కొన్నారు. మునుగోడులో బీఆర్ఎస్​కు తెలంగాణ ప్రజలు వీఆర్ఎస్ ఇవ్వడం ఖాయమని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ రాజకీయ పునరేకీకరణ కానే కాదు.. వివిధ రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ నిరుద్యోగులు, కాలం చెల్లిన నేతల ఏకీకరణ మాత్రమే అని ఆరోపించారు. తెలంగాణలో దోచుకున్న సొమ్ము లెక్క చెప్పలేక తన సొంత సోకుల కోసం ఖర్చు పెట్టడానికి కేసీఆర్ ఆడుతున్న డ్రామాలని విమర్శించారు.