మునుగోడులోనే బిజెపి నేతలు మకాం..

మునుగోడు ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని బిజెపి పట్టుదలగా ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం తో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. మరో రెండు నెలల్లో ఉప ఎన్నిక జరగనుంది. కాంగ్రెస్ కు రాజీనామా చేసిన రాజగోపాల్..బిజెపి లో నుండి పోటీచేయబోతున్నారు. ఈ క్రమంలో ఈ నెల 21 న మునుగోడు లో కేంద్ర మంత్రి అమిత్ షా భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. ఈ సభలోనే రాజగోపాల్ బిజెపి లో చేరనున్నారు.

ఈ సభ అనంతరం బిజెపి నేతలంతా మునుగోడు లో మకాం వేయనున్నారు. 21వ తేదీ అమిత్ షా సభ తర్వాత నేతలంతా మునుగోడులోనే ఉండాలని హైకమాండ్ ఆదేశించింది. సభ ముగిశాక బైపోల్స్ కమిటీని ప్రకటించనున్నారు. ఇటు బీజేపీ శ్రేణులు అమిత్ షా సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బైపోల్స్ ప్రచారంలో పాల్గొనేందుకు కేంద్రమంత్రులు, పలువురు జాతీయ నేతలు రానున్నారు. వారు కేంద్ర పథకాలను మునుగోడు ప్రజలకు వివరించనున్నారు. టీఆర్ఎస్ సర్కార్ అవినీతి, కుటుంబ పాలనపై విస్తృతంగా ప్రచారం చేయాలని భావిస్తున్నారు. మరోవైపు ఆర్టీఐ అస్త్రాన్ని బీజేపీ ప్రయోగించింది. మునుగోడు నియోజకవర్గానికి చెందిన పలు అంశాలకు సంబంధించి ఆర్టీఐ నుంచి వివరాలు కోరింది బీజేపీ. ఆ సమాచారం రాగానే టీఆర్ఎస్‌ విధానాలను ఎండగట్టాలన్నదే బీజేపీ నిర్ణయంగా కనిపిస్తుంది. మరోపక్క టిఆర్ఎస్ సైతం ఈ నెల 20 న మునుగోడు లో బహిరంగ సభ నిర్వహించబోతుంది. ఈ సభ కు సంబదించిన ఇంచార్జ్ లను కేసీఆర్ నియమించారు. ఇక కాంగ్రెస్ పరిస్థితి మరోలా ఉంది. ఉప ఎన్నికను పక్కకు పెట్టి నేతలంతా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ వస్తున్నారు. మొత్తం మీద మునుగోడు ఉప ఎన్నిక మాత్రం బిజెపి – టిఆర్ఎస్ ల మద్యే ఉండబోతుందని అంత మాట్లాడుకుంటున్నారు.