మైనర్ బాలిక అత్యాచారం కేసును సీబీఐకి అప్పగించాలని డీజీపీని కోరిన బిజెపి నేతలు

జూబ్లీహిల్స్ పబ్ కు వచ్చిన మైనర్ బాలిక ఫై గ్యాంగ్ రేప్ జరగడం రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ గా మారింది. ఈ అత్యాచారం ఘటన వెనుక రాజకీయ నేతలు కొడుకుల ప్రమేయం ఉండడం తో వీరిని తప్పించే ప్రయత్నం చేస్తుందని ప్రతిపక్ష పార్టీ లు , ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. ఇప్పటికే పలు పార్టీ లు, ప్రజా సంఘాలు ఈ కేసు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ, పోలీస్ స్టేషన్ ముట్టడికి యత్నించగా, తాజాగా ఈ కేసును సీబీఐకి అప్పగించాలని బిజెపి నేతలు డీజీపీని కోరారు.

ఈ కేసులో నిందితులుగా పెద్ద వాళ్ల కుమారులున్నందునే దర్యాప్తులో జాప్యం జరుగుతుందని ఆరోపించారు. ఘటనపై ఎఫ్​ఐఆర్​ నమోదు చేయటంలో జాప్యం, ప్రజాప్రతినిధుల పాత్ర లాంటి అంశాలపై తమకున్న అనుమానాలను డీజీపీకి వివరించారు. ఘటనలో నిందితులుగా పలువురు నేతల కుమారులుండటం వల్ల.. కేసును పక్కదారి పట్టించే అవకాశముందని అభిప్రాయపడ్డారు. నిందితులు తప్పించుకోకుండా.. కఠినశిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని కోరారు. డీజీపీని కలిసిన బిజెపి నేతలు రాంచందర్ రావు, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, బంగారు శృతి.. ఆ మేరకు వినతిపత్రం అందించారు.

ఇక అత్యాచార కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు కోర్టులో హాజరుపర్చనున్నారు. ప్రస్తుతం జూబ్లీహల్స్ పోలీస్‌స్టేషన్‌లో మాలిక్ అనే నిందితుడ్ని విచారిస్తున్నారు. మాలిక్‌తో పాటు మైనర్లు అయిన ప్రభుత్వ సంస్థ ఛైర్మన్‌ కుమారుడు, మరో బాలుడిని కూడా కోర్టు ముందుకు తీసుకురానున్నారు. ఉస్మానియాలో వైద్య పరీక్షల అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరు పర్చనున్నారు.