బండి సంజయ్ అరెస్ట్ ఫై తరుణ్ చుగ్ ఆగ్రహం

బండి సంజయ్ అరెస్ట్ ఫై బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ తరుణ్ చుగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల అరెస్ట్ తీరును తప్పుపట్టారు. బండి సంజయ్ ని అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. పదో తరగతి పేపర్ లీక్ ఘటన లో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పాత్ర ఉందంటూ పోలీసులు ఆయన ఫై 420, 120(బి), సెక్షన్ 5 ప్రివెన్షన్ ఆఫ్ మాల్ ప్రాక్టీస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం సంజయ్ ని హన్మకొండ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచబోతున్నారు.

కాగా సంజయ్ అరెస్ట్ ఫై బిజెపి శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం కావాలనే బండి సంజయ్ ఫై తప్పుడు ఆరోపణలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సంజయ్ అరెస్ట్ ను తీవ్రంగా ఖండించగా..తాజాగా తరుణ్ చుగ్ ..సంజయ్ అరెస్ట్ ఫై స్పందించారు. బండి సంజయ్ ని అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. అరెస్టుకు కారణాన్ని వెల్లడించడంలో తెలంగాణ పోలీసులు విఫలమయ్యారని ఆరోపించారు. TSPSC పేపర్ లీకేజీ ఇష్యూను బీజేపీ ప్రశ్నిస్తున్నందుకే తమ నాయకులను అరెస్టు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఏప్రిల్ 8 న మోడీ పర్యటనకు భయపడే… ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

సీఎం కేసీఆర్ అహంకారానికి బండి సంజయ్ అరెస్ట్ ఒక నిదర్శనం అని తరుణ్ చుగ్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ కు భయపడేది లేదని స్పష్టం చేశారు. కేసీఆర్ కుటుంబం అవినీతి పాలనపై బీజేపీ పోరాడుతూనే ఉంటుందన్నారు. పరిపాలన తీరును ప్రశ్నిస్తే జైల్లో వేస్తామంటే.. బీజేపీ నాయకులెవరూ భయపడరని వ్యాఖ్యానించారు.