ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ నేత బీఎల్ సంతోష్ కు హైకోర్టులో ఊరట..

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ నేత బీఎల్ సంతోష్ కు హైకోర్టులో ఊరట లభించింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా టిఆర్ఎస్ ఎమ్మెల్యే ల కొనుగోలు వ్యవహారం హాట్ టాపిక్ అయ్యింది. ఈ కేసు ను సిట్ కు బదిలీ చేయగా..ఈ కేసు విచారణ చేపట్టిన తెలంగాణ సిట్ బీఎల్ సంతోష్ ను కూడా నిందితుల జాబితాలో చేర్చింది. ఆయనకు సీఆర్పీసీ 41ఏ కింద నోటీసులు జారీ చేసింది.

తనను నిందితుడిగా పేర్కొని నోటీసులు ఇవ్వడం పట్ల బీఎల్ సంతోష్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనపై తెలంగాణ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే తప్పుడు ఆరోపణలు చేస్తోందని, సంబంధంలేని వ్యవహారంలో తన పేరును ప్రచారం చేస్తున్నారని బీఎల్ సంతోష్ తన పిటిషన్ లో ఆరోపించారు. సీఆర్పీసీ నోటీసులను రద్దు చేయాలని హైకోర్టును కోరారు. ఈ మేరకు ఆయన తరఫు న్యాయవాది లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు బీఎల్ సంతోష్ కు ఊరట కలిగిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది.

రోహిత్ రెడ్డి చేసిన ఫిర్యాదులో బిఎల్ సంతోష్ పేరు లేదని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు ఆయన తరపు న్యాయవాది. అంతేకాక ఎఫ్ఐఆర్ లో పేరు లేనప్పుడు ఆయనని నిందితుల జాబితాలో ఎలా చేరుస్తారని సంతోష్ తరపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయాలను పరిగణలోకి తీసుకున్న కోర్ట్ సిట్ విచారణ పై స్టే విధించింది.