బీహార్‌లో భాజపా మిత్ర ధర్మం

నితీష్‌ కుమార్‌నే సిఎంగా ప్రకటన

Nitish kumar with Modi - File
Nitish kumar with Modi – File

బీహార్‌ ఎన్నికల్లో ఎన్‌డిఎ కూటమికి ఎదురుగాలి వీస్తోందని, నితీష్‌కుమార్‌ జెడియుకు ఈసారి అనుమానమేనన్నట్లుగా వచ్చిన ఎగ్జిట్‌పోల్‌ సర్వేలు కొంతలోకొంత వాస్తవమే చెప్పాయి.

అయితే పార్టీ నైతికనియమావళిని అనుసరించి ముందునుంచీ చెపుతున్నట్లుగానే నితీష్‌ కుమార్‌నే ముఖ్యమంత్రిగా ప్రకటించి బిజెపి తన రాజధర్మం పాటించింది.

గత ఎన్నికలకంటే ఈసారి బీహార్‌ అసెంబ్లీలో నితీష్‌ నేతృత్వంలోని జెడియుకు 28 సీట్లు తక్కువవచ్చాయి.

43 సీట్లతోమాత్రమే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మైనార్టీలో ఉన్నప్పటికీ నితీష్‌కుమార్‌కే బీహార్‌ సిఎం పీఠం అని బిజెపిమాత్రమే కాదు నరేంద్రమోడీ కూడా ఎన్నికల సందర్భంగా ప్రచారంలో ప్రకటించారు.

ఏడోసారి ముఖ్యమంత్రిగా దీపావళి అనంతరం ప్రమాణ స్వీకారంచేసేందుకు నితీష్‌కుమార్‌ తనవంతుప్రయత్నాలు చేసుకుంటున్నారు. 2015తో పోలిస్తే ఈసారి జరిగిన ఎన్నికలు బీహార్‌ రాజకీయ ముఖచిత్రాన్నే మార్చి వేశాయని చెప్పవచ్చు.

ఉరకలేస్తున్న యువరక్తం అసెంబ్లీ బరిలో క్రియాశీలకంగా పనిచేసింది.

హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో అటు లోక్‌జనశక్తిపార్టీనుంచి చిరాగ్‌ పాశ్వాన్‌ తనదైన వ్యూహంతో ఎన్నికల గోదాలోకి దిగితే మరోపక్క మహాఘటబంధన్‌పేరిట మాజీ సిఎం లాలూ ప్రసాద్‌యాదవ్‌కుమారుడు తేజస్వియాదవ్‌ బీహార్‌ ఎన్నికల రంగంలో తనదైన ముద్రవేసుకున్నారు.

వచ్చీ రావడంతోనే పదిలక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదలచేసి,దేశంలో అతితక్కువ విదేశీ ప్రత్యక్షపెట్టుబడులు వస్తున్న రాష్ట్రం మనదేనని, అందుకు జెడియు ప్రభుత్వ నిర్వాకాలే కారణమంటూ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు.

ప్రచారంలో అంతా తానై రాష్ట్రం మొత్తంచుట్టేసివచ్చి నితీష్‌కుమార్‌ను ప్రజలు నిలబెట్టే స్థాయివరకూ తీసుకెళ్లగలిగారని చెప్పవచ్చు.

వరుసగా ముఖ్యమంత్రి పదవులు చేపడుతున్న నితీష్‌కుమార్‌ ఈసారి కూడా తనదే ఆధిపత్యం అని ఇవే తన చివరి ఎన్నికలని సెంటిమెంట్‌అస్త్రాన్ని కూడా వదిలారు. చివరి విడత ఎన్నికల సందర్భంగా వదిలిన ఈ అస్త్రం కూడా అంతగా పనిచేయలేదని తెలుస్తోంది.

గత ఎన్నికలకంటే ఈసారి 28 సీట్లు తక్కువసాధించి కేవలం 43 స్థానాలకే సరిపెట్టుకున్నారు. వాస్తవానికి ఈఎన్నికల్లో బిజెపి 110 స్థానాల్లోపోటీచేసి 74 స్థానాల్లో సింగిల్‌పార్టీగా విజయం సాధించింది.

గతంకంటే 21 స్థానాలు అదనంగా సాధిం చింది. ఇక 115 స్థానాల్లోపోటీచేసిన జెడియు కేవలం 43స్థానాలతోనే సరిపెట్టుకుంది.

దీనితో ఇపుడు నితీష్‌నే కొనసాగిస్తారా? లేక ఆయన్ను కేంద్రంలోకి తీసుకుని రాష్ట్రంలో బిజెపిపరంగా మరొక సిఎం అభ్యర్థిని ఎంపిక చేస్తారా అన్నదే ఇపుడు నలుగుతున్న ప్రశ్న.

అయితే ఈ సందేహాలకు బిజెపి తెరదించింది నితీష్‌కుమారే బీహార్‌ సిఎం అని అందులో ఎలాంటి సందేహంలేదని, బిజెపి ఇచ్చిన మాట తప్పదని రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ జైస్వాల్‌చేత చెప్పించింది.

సీట్లు తగ్గినంత మాత్రాన సిఎంపదవిలో మరొకరిని కూర్చోబెట్టే ప్రశ్నేలేదని, రాజ ధర్మాన్ని విస్మరించబోమని బిజెపి స్పష్టంచేసి నితీష్‌నే బలపరిచింది.

అయితే ఐదేళ్ల పూర్తికాలం సిఎంగా నితీష్‌ కొనసాగుతారా అన్న వాదనకు సరైన సమాధానాలు మాత్రం బిజెపి వద్దలేవు.

ఇతరమిత్రపక్ష పార్టీలన్నింటితో కలిసి మ్యాజిక్‌ఫిగర్‌దాటి అధికారం చేజిక్కించుకున్న ఎన్‌డిఎ కూటమిలో బిజెపిపరంగా నితీష్‌కుమార్‌కు రాష్ట్రంలో అటు ఆర్‌జెడినుంచి తేజస్వియాదవ్‌, ఎల్‌జెపి నుంచి చిరాగ్‌పాశ్వాన్‌ల నుంచే గట్టిదెబ్బతగిలిందని చెప్పాలి.

తాను ఎప్పటికీ నరేంద్రమోడీకి విధేేయుడిగానే ఉంటానని చెప్పిన చిరాగ్‌పాశ్వాన్‌ ఎన్నికల్లో ప్రధాని మోడీపైకాని, బిజెపిపై కానీ తీవ్రస్థాయి ఆరోపణలు కూడా చేయకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

తన వ్యతిరేకత అంతా బీహార్‌లోని నాయకత్వంపైనేనని రాష్ట్రం పూర్తిగా అధ్వాన్న స్థితికి తీసుకురావడానికి కారణం జెడియు అధినేత వైఖరేనంటూ ఆయన ప్రజల్లోకి వచ్చారు. అయినా సీట్లు సాధించలేకపోయినా ఓట్లు సాధించుకున్నారు.

ఒక్కస్థానంలో మాత్రమే విజయం సాధించింది. అయినా పార్టీ ఎన్నికల్లో నిర్ణయాత్మక పాత్ర పోషించింది.

వెయ్యిఓట్ల తేడాతో జెడియు అభ్యర్థులు ఎక్కువ నియోజకవర్గాల్లో ఓటమి పాలయ్యారంటే అందుకు ఎల్‌జెపియే కారణమన్న ధృడమైన అభిప్రాయం నెలకొంది. ఈసారి ఎన్నికలను అన్ని పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగానే భావించాయి.

కాంగ్రెస్‌కు ఎక్కువ సీట్లు కేటాయించడంవల్లనే తమకు నష్టం వాటిల్లిందని ఆర్‌జెడిలో కొందరు నేతలు ఇప్పటికే గుసగుసలు ప్రారంభించారు. వారి వాదనకు తగినట్లు గానే బీహార్‌లో కాంగ్రెస్‌ మరిన్ని స్థానాలను నష్టపోయింది.

గత ఎన్నికల్లో 41స్థానాల్లో పోటీచేస్తే ఈసారి 70స్థానాల్లోపోటీచేసింది. అయితే కేవలం 19స్థానాలకు మాత్రమే పరిమితం అయింది.

కాంగ్రెస్‌కు ఎక్కువ సీట్లు కేటాయించడమే కూటమికి చేటుతెచ్చిందన్న విమర్శలు కూడా వస్తున్నాయి.

ఆర్‌జెడి సొంతంగా బరిలోకి దిగితే పోటీ మరింత ఆసక్తిగా ఉండేదన్న వాదన కూడా లేక పోలేదు.

మొత్తంగాచూస్తే చిన్న చితక పార్టీలతోపాటు ఈసారి నితీష్‌కుమార్‌కు బీహార్‌లో ఎక్కువగా చిరాగా పాశ్వాన్‌పార్టీయే సమస్యాత్మకంగా మారిందని చెప్పవచ్చు.

సీట్ల కేటాయింపులనుంచి కూడా చిరాగ్‌ జెడియు వైఖరిని ఎండగట్టారు. అందుకు తగినట్లుగానే కూటమినుంచి బైటికి వచ్చేసి సొంతంగా పోటీకి నిర్ణయించారు.

అందు లోనూ బిజెపి పోటీచేసే సీట్లలో తప్ప మిగిలిన సీట్లలో మాత్రమే పోటీచేస్తున్నట్లు ప్రకటించారు. యువనేతల రాజకీయోత్సాహంతోపాటు బీహార్‌లో ప్రభుత్వ వ్యతిరేకత కూడా కొంత పనిచేసిందనే చెప్పాలి.

మొత్తంగాచూస్తే కాలం కలిసి రాకపోయినా బిజెపి అనుసరించిన రాజనీతితో నితీష్‌కుమార్‌ మళ్లీ సిఎం బాధ్యతలు చేపట్టగలిగారనిచెప్పడంలో ఎలాంటి సందేహంలేదు.

దామెర్ల సాయిబాబ, ఎడిటర్‌, హైదరాబాద్‌

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/