ఫామ్ హౌజ్ ఘటనపై సిట్ తో విచారణ చేపట్టాలన్న బీజేపీ

అధికార పార్టీ టిఆర్ఎస్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యే లను బిజెపి కొనుగోలు చేసేందుకు ట్రై చేసిందనే ఆరోపణల ఫై బీజేపీ తెలంగాణ శాఖ హైకోర్టును ఆశ్రయించింది. ఈ ఘటనకు సంబంధించి ప్రత్యేక విచారణ బృందంతో విచారణ చేయించాలని కోరింది. రాష్ట్ర పోలీసుల వ్యవహారశైలిఫై తమకు అనుమానం ఉందని అభ్యంతరం తెలిపింది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు చేయాలని పిటిషన్ లో పేర్కొంది.

ఈ సందర్భంగా తెలంగాణ పోలీసు శాఖపై బీజేపీ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ కేసులో చోటుచేసుకున్న పరిణామాలు పరిశీలిస్తే… తెలంగాణ పోలీసు శాఖ విచారణ చేపడితే అసలు వాస్తవాలు బయటకు రావని కూడా బీజేపీ ఆరోపించింది. ఈ కేసులో నిజానిజాలు నిగ్గు తేలాలంటే సిట్ విచారణ ఒక్కటే మార్గమని అభిప్రాయపడింది. బీజేపీ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. దానిపై విచారణ తేదీని ప్రకటించాల్సి ఉంది.

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశం రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మునుగోడు ఉపఎన్నికలో ఓటమి భయంతోనే టీఆర్ఎస్ తమపై నింద మోపుతోందని తమను బద్నాం చేయడానికే ఇలాంటి కుట్రలు పన్నుతోందని బీజేపీ ఆరోపించింది. ప్రభుత్వ పాలనలో అభివృద్ధి జరిగి ఉంటే ప్రజలే వారి పాలనకు పట్టం కడతారని గుర్తించాలని బీజేపీ నాయకులు అన్నారు. ఓటమి భయంతో టీఆర్ఎస్ నేతలు అన్ని విధాలుగా బీజేపీ గెలుపును అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు.