కార్మికుల ఆందోళనకు మద్దతుగా సోము వీర్రాజు ధర్నా
నెల్లూరు ధర్మోపవర్ ఉత్పత్తి కేంద్రం వద్దకు సోమువీర్రాజు

నెల్లూరు: బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తమ పార్టీ కార్యకర్తలతో కలిసి కార్మికుల ఆందోళనకు మద్దతుగా నెల్లూరు ధర్మోపవర్ ఉత్పత్తి కేంద్రం వద్ద ధర్నాకు దిగారు. ధర్మోపవర్ ఉత్పత్తి కేంద్రాన్ని ఎందుకు ప్రైవేటీకరిస్తున్నారో స్పష్టం చేయాల్సిన బాధ్యత ఏపీ ప్రభుత్వానికి ఉందని అన్నారు. ఒకవేళ దాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే ప్రయత్నాలు ఇలాగే కొనసాగిస్తే కార్మికుల తరఫున బీజేపీ పోరాడుతుందని స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా ప్రజలు మనుషులులా రాష్ట్ర ప్రభుత్వానికి కనపడడం లేదా? అని ఆయన ప్రశ్నించారు. ఆ పరిశ్రమ నష్టాలకు బాధ్యులు ఎవరని ఆయన నిలదీశారు. ఆయా విషయాలపై కార్మికులు స్థానిక ప్రజాప్రతినిధులను నిలదీయాలని ఆయన అన్నారు. ధర్మవరం ఉత్పత్తి కేంద్రం ఈ స్థితికి రావడంపై మంత్రులు ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు.
మరోవైపు, రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఏపీ ప్రభుత్వ తీరును నిరసిస్తూ నెల్లూరు కలెక్టరేట్ ముట్టడికి బీజేపీ నేతలు ప్రయత్నించారు. అయితే, అందులోకి వారిని రానివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. ముఖ్యమంత్రి జగన్కు వ్యతిరేకంగా బీజేపీ నేతలు నినాదాలు చేశారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత నెలకొంది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/