పెద్దవాళ్లకు చెప్పులు అందించడం సంస్కారంః బండి సంజయ్

ఆ సంస్కారం మీకేం అర్థమవుతుంది అంటూ బండి ధ్వజం

bjp-bandi-sanjay-replies-to-ktr-tweet

హైదరాబాద్ః ఢిల్లీలో చెప్పులు మోసే గులాములను తెలంగాణ రాష్ట్రం గమనిస్తోందంటూ మంత్రి కెటిఆర్ వ్యాఖ్యానించారు. దీనిపై తెలంగాణ బిజెపి చీఫ్ బండి సంజయ్ స్పందించారు. ఢిల్లీ లిక్కర్ మాఫియాలో పడి కొట్టుకుంటున్న కుటుంబ సభ్యుల రహస్యాలు బయటపడకుండా తంటాలు పడుతున్న డైవర్షన్ పాలిటిక్స్ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారంటూ బండి సంజయ్ దీటుగా బదులిచ్చే ప్రయత్నం చేశారు. అవసరం ఉంటే కాళ్లు మొక్కడం, అవసరం లేదంటూ కాళ్లు పట్టి గుంజడం కెసిఆర్ కుటుంబానికి వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు.

“కుటుంబంలో పెద్దలకు చెప్పులు అందించడం భారతీయతను పాటించే మాకు అలవాటు. మా కుటుంబ పెద్ద, గురుతుల్యుడు వంటి కేంద్ర హోమంత్రికి వయసులో చిన్నవాడినైన నేను చెప్పులు అందించడం గులామ్ గిరీ అవుతుందా? మీరు సాష్టాంగ దండప్రమాణం చేసినప్పుడు బెంగాల్ కు, తమిళనాడుకు గులాములు అయ్యారా? ఇప్పుడు పాదరక్షలు అందిస్తే గుజరాత్ కు గులాము అయినట్టా?

కెసిఆర్ లాగా అవసరాన్ని బట్టి పొర్లుదండాలు పెట్టడం మా రక్తంలో లేదు. అధికారం కోసం లోపటింట్లో రోజూ తన్నుకుంటున్న మీ కుటుంబ సభ్యులకు పెద్దలకు చెప్పులు అందించడంలోని సంస్కారం ఏం అర్థమవుతుంది? రామ, భరతుల వారసత్వాన్ని మేం తలకెత్తుకున్నాం. తండ్రిని బంధించి, అన్నను చంపి అధికారం పొందిన ఔరంగజేబు వారసుల పక్కన తిరిగే మీకు మా సంస్కృతి ఏం అర్థమవుతుంది?” అంటూ ధ్వజమెత్తారు. “మేం పాదరక్షలు మాత్రమే గౌరవంతో అందిస్తాం. మీలాగా అవసరాలు తీరాక పాదాలు పట్టి లాగేసే అలవాటు మాకు లేదు. మేం గులామ్ లం కాదు.. మీలాగా మజ్లిస్ కు సలాం కొట్టే రజాకార్ల వారసులం అసలే కాదు” అంటూ బండి సంజయ్ స్పష్టం చేశారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/