బీజేపీపై విరుచుకుపడ్డ ఓవైసీ..దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కోవాలి

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ విడుదల చేసిన వీడియో ఫై యావత్ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ వర్గం ప్రజలను కించపరిచేలా ఆయన వ్యాఖ్యలు చేయడం పట్ల బిజెపి కూడా సీరియస్ అయ్యింది. ఈయన చేసిన వ్యాఖ్యలు మరోసారి బిజెపి ఫై విమర్శలకు దారితీసింది. ప్రస్తుతం రాజాసింగ్ ను పోలీసులు అరెస్ట్ చేయడం..యూట్యూబ్ లో ఆయన పోస్ట్ చేసిన వీడియో ను తొలగించినప్పటికీ ఆగ్రహం మాత్రం చల్లారడం లేదు. తాజాగా దీనిపై అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు.

ఒవైసీ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఎనిమిదేళ్లుగా తెలంగాణ ప్రశాంతంగా ఉంది. శాంతి భద్రతలను విఘాతం కలిగించాలని బీజేపీ కుట్ర చేస్తోంది. బీజేపీ అధిష్టానం ఆదేశాలతోనే అలజడి సృష్టిస్తున్నారు. లౌకికవాదాన్ని వ్యతిరేకించడమే బీజేపీ విధానం. ఉప ఎన్నికల కోసం తెలంగాణను తగలబెడతారా?. ఇస్లామ్‌కు, మహ్మాద్‌ ప్రవక్తకు వ్యతిరేకంగా మాట్లాడటం బీజేపీకి పాలసీగా మారిపోయింది. రాజాసింగ్‌ విచారణను పోలీసులు రికార్డు చేయాలి’’ అని .. మతం పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టవద్దని, దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కోవాలని బిజెపికి డిమాండ్ చేసారు.

ఇదిలా ఉంటె రాజాసింగ్ చేసిన వ్యాఖ్యల ఫై బిజెపి అధిష్టానం కూడా సీరియస్ అయ్యింది. ఆయన్ను పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించకూడదో 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ శాసనసభాపక్ష నేతగా కొనసాగుతున్న ఆయన్ని ఆ పదవి నుంచి కూడా తొలగిస్తున్నట్లు హైకమాండ్ ప్రకటించింది.