తెనాలిలో కొత్త వైరస్.. భయపడుతున్న ప్రజలు!

ప్రస్తుతం కరోనా వైరస్ కేసుల సంఖ్య దేశవ్యాప్తంగా కొంచెం తగ్గుముఖం పడుతుండటంతో ప్రజలు ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే ఇదే సమయంలో సరికొత్త వైరస్ స్ట్రెయిన్ దేశంలో అడుగుపెట్టడంతో జనం మరింత భయాందోళనకు గురవుతున్నారు. ఇదిలా ఉండగానే పలు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందడంతో లక్షల సంఖ్యలో పక్షులు మృతి చెందుతున్నాయి. దీంతో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు అలర్ట్ అవుతున్నాయి.

ఇప్పటికే రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, కేరళ రాష్ట్రాల్లో లక్షల సంఖ్యల్లో పక్షులు మృతి చెందుతున్నాయి. తాజాగా ఏపీలోని తెనాలి సమీపంలో వందలాది పక్షులు మృతి చెంది కనిపించాయి. దీంతో ఒక్కసారిగా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అయితే కేవలం పక్షులకే బర్డ్ ఫ్లూ సోకడంతో కోళ్లకు సోకకుండా పౌల్ట్రీ నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఏదేమైనా ఇలా వరుసగా ఏదో ఒక వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వాలు ఈ వైరస్‌లు వ్యాప్తి చెందకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కాగా ఉత్తర భారతంలో కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకి అవి చనిపోతుండటంతో పౌల్ట్రీ పరిశ్రమ తీవ్ర నష్టాలను ఎదుర్కొంటోంది.