చివరి కోరిక తీరకుండానే బిపిన్‌ రావత్‌ కన్నుమూత

తమిళనాడు కూనూరు సమీపంలో జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో త్రిదళాధిపతి జనరల్​ బిపిన్​ రావత్​ ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో ఈయనతో పాటు ఈయన భార్య తో సహా మరో 11 మంది మృతి చెందారు. అయితే బిపిన్​ రావత్ మృతి పట్ల యావత్ దేశ ప్రజలే కాదు ఇతర దేశాలు సైతం దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. కాగా బిపిన్​ రావత్ తన చివరి కోరిక తీరకుండానే మరణించినట్లు తెలుస్తుంది.

బిపిన్‌ రావత్‌ రిటైరయ్యాక ఉత్తరాఖండ్‌లోని స్వగ్రామమైన ‘సైనా’లో ఇళ్లు కట్టుకోవాలని అనుకున్నారట. ఈ విషయాన్నీ బిపిన్‌ మేనమామ భరత్‌ తెలిపారు. ‘2018లో రావత్‌ వచ్చినపుడు కులదేవతకు పూజ చేశారు. రిటైరయ్యాక ఇక్కడే ఇల్లు నిర్మించుకుంటానని చెప్పారు. స్వగ్రామంతో బిపిన్‌కు అనుబంధం ఎక్కువ. ఊరి జనం ఉపాధి నిమిత్తం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడం తనను బాధిస్తోందని, రిటైరయ్యాక ఈ ప్రాంతం కోసం ఏదైనా చేస్తానని గ్రామస్తులకు చెప్పారు. బిపిన్‌ ఫోన్లో నాతో మాట్లాడేవారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో సైనీకి వస్తానన్నారు’ అంటూ భరత్‌ కన్నీరు పెట్టుకున్నారు.