ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అధికారిక ప్రకటన : బిపిన్ రావత్ మృతి

తమిళనాడు కూనూరు సమీపంలో ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో త్రిదళాధిపతి జనరల్​ బిపిన్​ రావత్​ దంపతులు ప్రాణాలు కోల్పోయారు. హెలికాఫ్టర్‌లో మొత్తం 14 మంది ప్రయాణిస్తుండగా 13 మంది చనిపోయినట్లు అధికారులు ధృవీకరించారు. సూలూరు నుంచి వెల్లింగ్టన్‌లోని డిఫెన్స్ సర్వీసెస్ కాలేజీకి వెళ్తుండగా మధ్యాహ్నం 12:20 నిమిషాలకు ఈ హెలికాఫ్టర్ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి కారణాలేమిటో తెలుసుకునేందుకు భారత వాయు సేన (ఐఏఎఫ్) దర్యాప్తునకు ఆదేశించింది.

ప్రమాదంలో గాయపడిన పైలట్ ‘గ్రూప్​ కెప్టెన్’​ వరుణ్​ సింగ్​.. వెల్లింగ్టన్​లోని సైనిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సీడీఎస్​ బిపిన్​ రావత్​, ఆయన భార్య, ఆర్మీ అధికారుల పార్థివ దేహాలు గురువారం సాయంత్రానికి దిల్లీకి చేరుకునే అవకాశం ఉన్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. కోయంబత్తూర్​ సమీపంలోని సూలూర్​ వైమానిక స్థావరం నుంచి బయల్దేరిన Mi-17V5 చాపర్​.. కూనూర్​ సమీపంలోని కట్టేరి- నాంచప్పనంచథ్రం వద్ద మధ్యాహ్నం 12.20-12.30 గంటల ప్రాంతంలో కూలిపోయింది.జనరల్​ రావత్​.. వెల్లింగ్టన్​లోని డిఫెన్స్​ స్టాఫ్​ కాలేజ్​లో లెక్చర్​ ఇచ్చేందుకు వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. పొగమంచుతో వెలుతురు సరిగా లేకపోవడమే.. ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.

బిపిన్ రావత్‌ విషయానికి వస్తే..జనరల్ బిపిన్ రావత్ 1958 మార్చి 16వ తేదీన జన్మించారు. తండ్రి కూడా ఆర్మీ తరపున దేశానికి సేవ చేశారు. సెయింట్ ఎడ్వర్డ్ స్కూల్‌, నేషనల్ డిఫెన్స్ అకాడెమీలో జనరల్ బిపిన్ రావత్ చదువుకున్నారు. 1978 డిసెంబర్ 16వ తేదీన 11వ గోర్ఖా రైఫిల్స్‌లోని ఐదవ బెటాలియన్‌లో విధుల్లో చేరారు. ఈ బెటాలియన్‌కు తన తండ్రే కమాండర్‌గా వ్యవహరించారు. డెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలటరీ అకాడెమీలో డిగ్రీ చేస్తున్న సమయంలోనే అతన్ని స్వోర్డ్ ఆఫ్ హానర్‌ అవార్డు వరించింది. ఇక అంచలంచెలుగా ఎదిగా 2016 డిసెంబర్ 31 నుంచి 2019 డిసెంబర్ 31 వరకు చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. మిలటరీ మీడియా స్ట్రాటెజిక్ స్టడీస్ పై రీసెర్చ్ చేసినందుకు గాను మీరట్‌లోని చౌదరి చరణ్ సింగ్ యూనివర్శిటీ జనరల్ బిపిన్‌ రావత్‌ను డాక్టరేట్‌తో గౌరవించింది.

దేశం కోసం దాదాపుగా 42 ఏళ్లు సేవలందించిన బిపిన్ రావత్‌ను పలు ప్రెసిడెన్షియల్ అవార్డులు వరించాయి. ఇందులో పీవీఎస్ఎం, యూవైఎస్ఎం, ఏవీఎస్ఎం, వైఎస్ఎం, ఎస్ఎం, వీఎస్ఎంలు ఉన్నాయి. కాంగోలో ఐక్యరాజ్యసమితి తరపున పనిచేస్తున్న సమయంలో ఫోర్స్ కమారండర్ కమెండేషన్‌ అవార్డును రెండు సార్లు పొందారు. ఇక 2019 డిసెంబర్ 31వ తేదీన భారత్‌కు తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్‌గా జనరల్ బిపిన్ రావత్ నియమించబడ్డారు.