బలపరీక్షకు ముందే బిహార్‌ స్పీకర్​ రాజీనామా

తనపై సభ్యులు తప్పుడు ఆరోపణలు చేయడంతోనే రాజీనామా చేశానన్న స్పీకర్

Bihar Speaker Vijay Kumar Sinha resigns ahead of floor test

పాట్నాః నీతీశ్​ కుమార్​ సర్కార్​ బలపరీక్షకు ముందు బిహార్​ రాజకీయాల్లో కీలక పరిణామం జరిగింది. తనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన నేపథ్యంలో అసెంబ్లీ స్పీకర్ విజయ్ కుమార్ సిన్హా తన పదవికి రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చిన నితీశ్ కుమార్.. ఆర్జేడీ, కాంగ్రెస్ తో మహాకూటమిగా ఏర్పడి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ నెల ప్రారంభంలో ఎనిమిదోసారి ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌ ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. ఈ కూటమికి 165 మంది ఎమ్మెల్యేల సంఖ్యా బలం ఉంది. ఈ నేపథ్యంలో నితీశ్ కుమార్ నేతృత్వంలోని మహాఘటబంధన్ ప్రభుత్వం రెండు రోజుల ప్రత్యేక సమావేశాల ప్రారంభ రోజైన బుధవారం బలపరీక్షకు సిద్ధమైంది.

అయితే, బలపరీక్షకు ముందే బీహార్ అసెంబ్లీ స్పీకర్ విజయ్ కుమార్ సిన్హా తన రాజీనామాను సమర్పించారు. తనపై తప్పుడు ఆరోపణలు రావడంతో పదవి నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు. తనపై సభ్యులు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం అస్పష్టంగా ఉందని, నిబంధనల ప్రకారం లేదని అన్నారు. వచ్చిన తొమ్మిది లేఖల్లో ఎనిమిది నిబంధనల ప్రకారం లేవని ఆయన అసెంబ్లీలో ప్రకటించారు.

మరోవైపు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ హయాంలో జరిగిన ‘ఉద్యోగాల కోసం భూమి’ కుంభకోణం కేసులో పలువురు ఆర్జేడీ నేతలకు చెందిన నివాసాలు, కార్యాలయాల్లో సీబీఐ దాడులు చేస్తోంది. గుర్గావ్ లోని ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్, ఆయన సహచరులకు చెందిన మాల్ లో కూడా సోదాలు నిర్వహిస్తోంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/