అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా రేపు బీహార్ బంద్

కేంద్రం తీసుకొచ్చిన అగ్ని పథ్ స్కీంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. అగ్నిపథ్ స్కీంను కేంద్రం వెనక్కి తీసుకోవాలంటూ బీహార్, హర్యానాలో మొదలైన ఈ ఆందోళనలు తెలంగాణలో ఉద్రిక్తంగా మారాయి. ఈరోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రణరంగంగా మారింది. కేంద్రం వైఖరిని నిరసిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో యువకులు చేపట్టిన ఆందోళన నిమిషాల వ్యవధిలోనే హింసాత్మకంగా మారింది. ఆందోళనకారులు రైళ్ల అద్దాలు ధ్వంసం చేయడంతో పాటు బోగీలకు నిప్పు పెట్టారు. దీంతో ప్రయాణికులు భయంతో వణికిపోయారు. ప్రాణాలు అరచేత పట్టుకుని స్టేషన్ నుంచి బయటకు పరుగులు పెట్టారు. అంతటితో శాంతించని ఆందోళనకారులు మూడు ఫ్లాట్ ఫాంలను పూర్తిగా ధ్వంసం చేశారు. హౌరా ఎక్స్‌ప్రెస్, ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్ సహా మూడు రైళ్లకు నిప్పంటించారు. రైల్వే స్టేషన్ బయట బస్సులపై రాళ్లు రువ్వారు. ఆందోళన కారులను అదుపు చేసేందుకు పోలీసులు కాల్పులు జరుపగా..ఓ యువకుడు మృతి చెందాడు.
ఇక ఇప్పట్లో ఈ ఆందోళనలు దేశ వ్యాప్తంగా చల్లారే అవకాశం లేనట్లు తెలుస్తుంది. బీహార్‌లో శనివారం బంద్‌కు పిలుపునిచ్చారు. ఆ రాష్ట్రంలోని ప్రధాన ప్రతిక్షమైన రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) ఈ బంద్‌కు మద్దతిచ్చింది. ఈ బంద్ ప్రధానంగా ప్రజా రవాణాపై ప్రభావం చూపనున్నది. రైలు, బస్సు సేవలకు ఆటంకం కలిగే అవకాశముంది. మార్కెట్లు, సంతలతోపాటు షాపులు మూతపడనున్నాయి. కాగా, అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా బీహార్‌లో జరుగుతున్న నిరసనలు, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసానికి ఆర్జేడీ కారణమని బీజేపీ నేత, కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ఆరోపించారు. ఆ పార్టీ దీనికి సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందని విమర్శించారు. అలాగే నిరసనల్లో పాల్గొనే వారిలో విద్యార్థులు కాని వారిని గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. ప్రజా ఆస్తులను తగలబెట్టే ఆర్జేడీ ఆగ్రహ నిరసనలలో బీహారీలు చనిపోతున్నారు. బీహార్‌కు ఆర్జేడీ సమాధానం చెప్పాలి’ అని బెగుసరాయ్ ఎంపీ అయిన గిరిరాజ్ సింగ్ డిమాండ్ చేశారు. ఇవాళ కూడా బీహార్‌లో యువత చెలరేగిపోయారు. కొత్త ఆర్మీ రిక్రూట్మెంట్ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టారు. ఇవాళ నిరసనకారులు బీహార్‌లోని లఖ్మినియా రైల్వే స్టేషన్‌కు నిప్పుపెట్టారు. రైల్వే ట్రాక్‌లను ధ్వంసం చేసి రైళ్లను నిలిపివేశారు.