బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల విహంగ వీక్షణం

ప్రస్తుతం విచిత్ర పరిస్థితి!

Bihar Assmebly Elections
Bihar Assmebly Elections

బీహార్‌ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల మొదటి విడత పోలింగ్‌ ఈ నెల 28న జరిగింది.

నవంబర్‌ 3న రెండవ విడత ఆ తర్వాత నవంబర్‌ 7న మూడో విడత వరుసగా మూడు విడతల్లో కలిపి మొత్తం 243 స్థానాలకు బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి.

నవంబర్‌ 10న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలలో ప్రస్తుతం ఒక విచిత్ర పరిస్థితి నెలకొంది.

‘సమోసాలో ఆలూ ఉన్నంతవరకు బీహార్‌ రాజకీయాల్లో లాలూ ప్రసాద్‌ ఉంటారని గతంలో లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కోతలు కోశారు.

భారతదేశ మార్కెట్లో ‘ఆలు ధర మండిపోతూ బతికే ఉంది. కానీ ప్రస్తుతం లాలూ ప్రసాద్‌ యాదవ్‌ జైలులో ఉండటం వల్ల బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి రాలేకపోతున్నాడు.

మరో ప్రముఖ దళిత నాయకుడు రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ ఇటీవలే మరణించారు.

సోషలిస్టు భావజాలం ఉన్న సీనియర్‌ నాయకులు బీహార్‌ రాజకీయాల్లో అంతరిస్తున్న దిశలో అప్పటి తరం సోషలిస్టు సీనియర్‌ నాయకుడు అనుభవశాలి నితీష్‌కుమార్‌ మాత్రమే అన్నీ తానై, తానే అన్ని అయి బీహార్‌ ఎన్నికలను ఎదు ర్కొంటున్నారు.

మిగతా ఇద్దరు యువ నాయకులు తేజస్విప్రసాద్‌ యాదవ్‌, చిరాగ్‌ పాస్వాన్‌లు తమ తండ్రుల వారసత్వాన్ని తీసుకున్నారు. ఈ వారసత్వ పరీక్షలో ఉత్తీర్ణులు అవ్ఞతారా లేక చతికిలబడతారా అన్నది కాలమే నిర్ణయిస్తుంది.

భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో మనదేశంలోని కొన్ని రాష్ట్రాలను ‘బీమారి’రాష్ట్రాలుగా పేర్కొన్నారు.

ముఖ్యంగా బీహార్‌, ఉత్తర ప్రదేశ్‌, రాజస్థాన్‌ ఇలాంటి రాష్ట్రాలు ‘బీమారి’ రాష్ట్రాలుగా పిలువ బడ్డాయి. బీమారి అనే హిందీ పదానికి తెలుగు అర్థం ‘రోగం’ అని అర్థం.

పేదరికం, నిరక్షరాస్యత, అభివృద్ధిలో వెనుకబడి ఉండడం, మౌలిక వసతులు లేకపోవడం, ఆదిమకాలం నాటి ఆచారాలను నేటి ఆధునిక కాలంలో కూడా ఇంకా పాటించడం. ముఖ్యంగా కులవ్యవస్థ బలంగా వేళ్లూనుకొని ఉండటం, ఈ బీమారి రాష్ట్రాల జబ్బులుగా చెప్పుకోవచ్చు.

వీటితోపాటు గూండాగిరి, రాజకీయాలలో ప్రైవేట్‌ సైన్యాలు కర్రున్నవాడిదే బర్రె అనే సామెత లాగా కండబలం, అర్థబలం, అంగబలం, నేరచరిత్ర బీహార్‌రాష్ట్రంలో రాజ్యమేలుతున్నాయి.

ఇక బీహార్‌ విషయానికి వస్తే నితీష్‌ కుమార్‌ ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత గత పదిహేను సంవత్సరాల కాలంలో ఈ రాజకీయాల తీరు మారినా కూడా వీటిని అంతమొందించడానికి ప్రయత్నించిన రాజకీయాల కంటే వీటిని పెంచి పోషించిన రాజకీయాలే ఇప్పటిదాకా ఎక్కు వగా రాజ్యమేలాయి.

ఈ రాష్ట్రాలలో రాజకీయాలలో మొదటి నుండి ఉన్న కుల ప్రభావం ఒక జబ్బులాగా ఇటీవల కాలంలో మరింత పెరిగింది. ప్రస్తుత ఎన్నికలలో కులజబ్బు రాజకీయాలను పెద్దఎత్తున శాసిస్తుంది.

మూడు ప్రధాన పార్టీలకు తోడుగా జాతీయ పార్టీలైన బిజెపి, కాంగ్రెస్‌ ఏదో ఒక ప్రాంతీయ పార్టీతో జతకట్టడం సుమారు రెండు దశాబ్దాలుగా మామూలైపోయింది.

గత 2015 ఎన్నికల విషయాన్ని చూస్తే ఆనాడు లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కాంగ్రెస్‌, నితీష్‌ కుమార్‌ మహాకూటమి ఏర్పాటు చేసి బిజెపి ఆధ్వర్యంలో ఉన్న ఎన్డీయే కూటమితో పోరాడారు. చివరికి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ రాష్ట్రీయ జనతాదళ్‌ పార్టీ 101ఒక్క సీట్ల కు పోటీ చేసి 80 సీట్లు గెలుచుకుంది.

నితీష్‌కుమార్‌ యాదవ్‌ పార్టీ కూడా 101 సీట్లకు పోటీ చేసి 70 సీట్లు గెలుచుకుంది. భారత జాతీయ కాంగ్రెస్‌ పార్టీ నలభై ఒక్కసీట్లకు పోటీ చేసి 27 సీట్లు గెలుచుకుంది.

మొత్తం మీద మహాకూటమిని 178 సీట్లు గెలుచుకొని ఎన్డీయే కూటమిని ఓడించింది.

ఆ పరిణామక్రమంలో లాలూ ప్రసాద్‌తో జత కలిపి నితీష్‌ కుమార్‌ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పాటు చేశారు.

ఇక ప్రస్తుత విషయానికి వస్తే 2015 అసెంబ్లీ ఎన్నికలలో ఎన్డీయే కూటమిలో కలిసి పోటీ చేసి రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌ పార్టీ లోక్‌ జనశక్తి ఆయన మరణానంతరం ఆయన కుమారుడు చిరాగ్‌ పాశ్వాన్‌ ఆధ్వర్యంలో అటు మహా కూటమిలో కానీ ఇటు ఎన్డీయేలో కానీ చేరకుండా స్వతంత్రంగా పోటీ చేస్తున్నారు.

అప్పటి మహాకూటమిలో ఉన్న పార్టీలలో నితీష్‌ కుమార్‌ పార్టీ ప్రస్తుతం బిజెపి ఆధ్వర్యంలో ఎన్‌డిఎ కూటమిలో ఉంది.

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు అన్న దానికి ఇది ఒక మంచి ఉదాహరణ.

బీహార్‌ రాజకీయాలను గత 40 ఏళ్లుగా శాసిస్తున్న లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ప్రస్తుతం అనేక అవినీతి కేసులలో ఇరుక్కుని కోర్టులో తీర్పు వచ్చి జైలు పాలయ్యారు.

ఆయన కుమారుడు తేజస్వి యాదవ్‌ ఎన్డీయే కూట మికి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్నారు. కాంగ్రెస్‌ అండతో ముందుకు దూసుకెళ్తున్నారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి రాష్ట్రంలో అధికారంలో ఉన్న నితీష్‌ కుమార్‌ పార్టీ ఎన్డీయే కూటమికి రేపటి ఎన్నికల్లో గెలవడానికి ఎక్కువ అవకాశాలున్నాయని ఓటర్‌ సర్వేలు చెబుతున్నాయి.

లాలూ ప్రసాద్‌ యాదవ్‌ వారసత్వం తేజస్వి యాదవ్‌కు గుదిబండగా మారనుందా అని మరో అనుమానం వస్తుంది.

లాలూ ప్రసాద్‌ యాదవ్‌ పేరును తన ప్రచారంలో చాలా వరకు తేజస్వి ప్రసాద్‌ యాదవ్‌ వాడుకోకపోవడం కూడా ఆ సందేహానికి ఊతమిస్తుంది.

ఆర్జెడి ఎన్నికల గుర్తు అయిన లాంతరు లాలూ ప్రసాద్‌ యాదవ్‌ చర్యల వల్ల నేరచరిత వల్ల మాసకబారిందా? అనే అనుమానం వస్తుంది.

ఇక చిరాగ్‌ పాశ్వాన్‌ ఆశాదీపం వెలుగుతుందా? రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌ మరణం సానుభూతి పవనాలు చిరాగ్‌ పాశ్వాన్‌ పార్టీని ఎంతవరకు కాపాడుతాయి అనేది ప్రశ్నార్థకమే.

మొత్తం 243 స్థానాల్లో మ్యాజిక్‌ ఫిగర్‌ 122 స్థానాలు ఎవరికి వస్తే వారిదే అధికారం. ఒకనాడు బీహార్‌లో వెలుగు వెలిగిన వామపక్షాల ప్రభ అడుగంటింది.

రాష్ట్రీయ లోక్‌దళ్‌, జనతాదళ్‌, యునైటెడ్‌ ప్రాంతీయ పార్టీల మధ్య పోటీలో మూడవ పార్టీ బతికిబట్ట కడుతుందా అనేది చిరాగ్‌ పాశ్వాన్‌కు వచ్చే ఓట్లను బట్టి తెలుస్తుంది.

మూడవ పార్టీగా ఆయన తండ్రి రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ ఒక ప్రముఖ దళిత నాయకుడుగా ఉండి కూడా ఎక్కువ సీట్లు సాధించలేని పరిస్థితి గతంలోనే ఉంది.

కనుక ఇప్పుడు ఆయన సానుభూతితో ఏమైనా ఓట్లు పెరుగుతాయా లేక ఇంకా ఓట్లు తక్కువ అవుతాయా అనేది కూడా ఆలోచించాలి.

మొత్తం మీద బీహార్‌ ఎన్నికలు అటు నితీష్‌, ఇటు బిజెపికి మిగతా ప్రతిపక్షాలకు ఒక పరీక్షగా నిలబడే అవకాశం ఉంది.

  • బి. రామ్మోహనరావు

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/