నందిగ్రామ్ సహకార సంఘాల ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్

పశ్చిమ్ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి మరోసారి భారీ షాక్ తగిలింది. నందిగ్రామ్ సహకార సంఘాల ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసి మమతా కు షాక్ ఇచ్చింది. భేకుటియా సమబే కృషి సమితిలోని మొత్తం 12 డైరెక్టర్ స్థానాలకుగానూ ఆదివారం జరిగిన ఎన్నికల్లో బీజేపీ 11 దక్కించుకోగా.. తృణమూల్ కాంగ్రెస్ ఒక్కటి మాత్రమే గెలుపొందింది. ఇప్పటి వరకూ తృణమూల్ కాంగ్రెస్ చేతిలో ఉన్న సహకార సమితి తాజా ఓటమితో చేజారింది.

గత నెలలో జరిగిన నందిగ్రామ్-2 బ్లాక్ ఎన్నికల్లో 51 సీట్లను టీఎంసీ, ఒక్కటి సీపీఎం గెలుచుకోగా.. బీజేపీ కనీసం ఒక్క స్థానంలోనూ గెలవలేకపోయింది. అలాగే, కొటాయ్, సింగూరు ఎన్నికల్లోనూ దీదీ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. ఇక, ఆదివారం నాటి ఎన్నికల సందర్భంగా జరిగిన సంఘటనలపై ఇరు పార్టీలూ పరస్పర ఆరోపణలు గుప్పించుకున్నాయి. ఓటింగ్ ప్రకియకు విఘాతం కలిగించేందుకు బయట వ్యక్తులను టీఎంసీ తీసుకొచ్చిందని బీజేపీ ఆరోపించగా.. సువేందు అధికారే జనాలను భయపెట్టారని తృణమూల్ కాంగ్రెస్ నేతలు ఎదురుదాడి చేశారు.