స్వాతంత్ర్య దినోత్సవం నాటికి సాధారణ పరిస్థితులు

మే 1 నుంచి అమెరికన్లందరికీ కరోనా వ్యాక్సిన్.. జో బైడెన్​

వాషింగ్టన్: దేశ స్వాతంత్ర్య దినోత్సవం అయిన జులై 4 నాటికి మళ్లీ సాధారణ పరిస్థితులు వస్తాయని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. మే 1 నుంచి ప్రతి ఒక్కరికీ కరోనా వ్యాక్సిన్ అందుతుందన్నారు. 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ వేస్తామన్నారు. దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి బైడెన్ ప్ర‌స‌గించారు. కరోనాతో చనిపోయిన వారికి నివాళులర్పించారు. వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగంగా జరిగేలా మరో 4 వేల మంది సిబ్బందిని నియమిస్తాని ఆయన ప్రకటించారు. ఇప్పటికే 2 వేల మందిని నియమించామన్నారు. కొత్త కరోనా రకాలను కట్టడి చేసేందుకు తమ ప్రభుత్వం అన్ని రకాల చర్యలను తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఇప్పటికే వాటి జన్యు క్రమ విశ్లేషణ చేయడంతో పాటు టెస్టింగ్ సామర్థ్యాన్ని పెంచుతామని తెలిపారు.

‘‘మీ అందరికీ ఓ నిజం చెబుతున్నా. మళ్లీ మామూలు పరిస్థితులు ఎప్పుడొస్తాయని అడుగుతున్న వారందరికీ ఇదే నా సమాధానం. ప్రస్తుతం మన జీవితాలను బాగు చేసుకోవాలన్నా.. ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టాలన్నా.. చాలా కష్టంతో కూడుకున్నది. కానీ, పరిస్థితులను చక్కదిద్దేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నా. అందులో పురోగతి కనిపిస్తోంది. కచ్చితంగా అతి త్వరలోనే మనం మళ్లీ సాధారణ పరిస్థితులను చూస్తాం’’ అని ఆయన భరోసా ఇచ్చారు. దేశంలో ఇప్పటిదాకా 5,27,000 మంది చనిపోయారని బైడెన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సంఖ్య మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం, వియత్నాం యుద్ధం, 9/11 దాడుల్లో చనిపోయిన వారి సంఖ్య కన్నా ఎక్కువేనన్నారు. వాళ్లు చనిపోతే కనీసం ఏడ్చే పరిస్థితి కూడా లేకుండాపోయిందన్నారు. దగ్గరుండి వారి అంత్యక్రియలు చేయలేని పరిస్థితి అని ఆవేదన వ్యక్తం చేశారు. తన జేబులో మహమ్మారితో బలైపోయిన అమెరికన్ల సంఖ్యతో కూడిన ఒక కార్డు ఉంటుందని, ఎప్పటికప్పుడు అందులో వివరాలను చేరుస్తూ ఉంటానని ఆయన వెల్లడించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/