భూమా అఖిలప్రియకు 14 రోజులు రిమాండ్‌

మాజీ మంత్రి, టీడీపీ మహిళా నేత భూమా అఖిలప్రియకు కోర్టు 14 రోజలు రిమాండ్ విధించింది. అలాగే ఆమె తో ఆమె భర్త భార్గవ్ రామ్ కు సైతం రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మంగళవారం నంద్యాల జిల్లా కొత్తపల్లిలో నిన్న టీడీపీ నేతలు భూమా అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి వర్గాల మధ్య దాడులు చోటు చేసుకున్నాయి. అఖిలప్రియ వర్గంపై తనపై దాడి చేసి హత్యాప్రయత్నం చేసిందని ఆరోపిస్తూ ఏవీ సుబ్బారెడ్డి కేసు పెట్టారు. అఖిల ప్రియ కూడా తన చున్నీ లాగి, బట్టలు చించేశారని కేసు పెట్టారు.

ఈ రెండు కేసులు నమోదు చేసుకున్న పోలీసులు.. హత్యాయత్నం కేసులో అఖిలను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. వాదనలు విన్న కోర్ట్ అఖిల ప్రియా తో పాటు ఆమె భర్త కు 14 రోజుల డిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో అఖిలతో పాటు ఆమె భర్త భార్గవ్ రామ్ ను కర్నూలు సబ్ జైలుకు తరలిస్తున్నారు. కోర్టు రిమాండ్ విధించిన తర్వాత వీరిద్దరూ బెయిల్ కోసం దరఖాస్తు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

వాస్తవానికి అఖిలప్రియకూ, ఏవీ సుబ్బారెడ్డికీ మధ్య ఎప్పటి నుంచో పోరు నడుస్తోంది. అఖిల తండ్రి భూమా నాగిరెడ్డి మరణం తర్వాత ఆమెకు వారసత్వంగా రావాల్సిన ఆస్తులు రాకుండా సుబ్బారెడ్డి అడ్డుపడ్డారని ఆమె అనుమానిస్తున్నారు. వాటి వివరాలు కూడా తనకు చెప్పకుండా దాచి పెట్టారని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య పెరిగిన గ్యాప్ కాస్తా దాడుల వరకూ వెళ్లింది.