నేడు అయోధ్యలో భూమి పూజ

శంకుస్థాపన చేయనున్న ప్రధాని మోడి

నేడు అయోధ్యలో భూమి పూజ
Ayodhya

అయోధ్య: అయోధ్యలో రామాలయ నిర్మాణానికి బుధవారం మధ్యాహ్నం 12 గంటల 44 నిమిషాల 8 సెకన్లకు భూమిపూజరుగనుంది. ప్రధాని నరేంద్రమోడి స్వయంగా గర్భగుడి ప్రాంతంలో 40 కిలోల వెండి ఇటుకను స్థాపించనున్నారు. శంకుస్థాపనకు సకలసన్నాహాలు పూర్తయ్యాయి. శంకుస్థాపనకు ఎలాంటి అవరోధాలు కలగకుండా 12 మంది పురోహితులు విఘ్నేశ్వరుడికి పూజాదికాలు నిర్వహించారు. మంగళవారం ఉదయం 9 గంటలకు 21 మంది పురోహితులు వేద పఠనం ఆరంభించారు. కాగా శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధాని మోడితో పాటు ప్రముఖులు, 135 సంస్థలకు చెందిన వివిధ మత సంస్థలకు చెందిన సాధువులు తరలిరానున్నారు.

ఇప్పటికే భూమిపూజ సందర్భంగా ఉగ్రదాడులు జరగవచ్చన్న ఇంటిలిజెన్స్‌ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అత్యున్నత స్థాయి భద్రతను కల్పించారు. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) ఇప్పటికే అయోధ్య పట్టణాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంది. నగరంలో రాకపోకలపై ఆంక్షలు భద్రతా బలగాలు ఆంక్షలు విధించాయి. అయోధ్యను ఆనుకొని ఉన్న 9 జిల్లాల్లోనూ భద్రతను కట్టుదిట్టం చేశారు. అయోధ్య నేపాల్‌తో సరిహద్దు కలిగి ఉన్న బస్తీ డివిజన్‌లో ప్రత్యేకంగా ఆంక్షలు అమలు చేస్తున్నారు. సరిహద్దు ప్రాంతాలు, జలమార్గాలపై నిఘా పెంచారు. రామాలయ భూమిపూజలో కొవిడ్‌ ప్రోటోకాల్‌ కఠినంగా పోలీస్‌ అధికారులు అమలు చేస్తున్నారు. 45 ఏళ్ల లోపు ఉండి, కరోనా నెటిగివ్‌ వచ్చిన వారికే ప్రధాని భద్రతా బృందంలో చోటు కల్పించారు. భద్రతలో భాగంగా జిల్లా సరిహద్దులు మూసివేయడంతో పాటు ట్రాఫిక్‌ ఆంక్షలు అమలు చేస్తున్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/