‘అహంకారానికి, ఆత్మగౌరవానికి మధ్య యుద్ధం’

‘భీమ్లా నాయక్’ ప్రీరిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్

'Bheemla Nayak' prerelease event
‘Bheemla Nayak’ prerelease event

పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌, రానా దగ్గుబాటిల కాంబినేషన్‌లో ప్రఖ్యాత నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మించిన చిత్రం ‘భీమ్లానాయక్‌’. నిత్యామీనన్‌, సంయుక్తమీనన్‌ కథానాయికలు. మాటల మాంత్రికుడు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ సంభాషణలు, స్ర్కీన్‌ప్లే అందించారు .సాగర్‌ కె.చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి తమన్‌ స్వరకర్త. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్‌, ట్రైలర్లు సినిమాపై రెట్టింపు అంచనాలను పెంచాయి. ఈ నెల 25 ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుక బుధవారం హైదరాబాద్‌ యూసఫ్‌గూడ పోలీస్‌ గ్రౌండ్‌లో అత్యంత వైభవంగా జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌ కొత్త ట్రైలర్‌ను విడుదల చేశారు. మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌, దానం నాగేందర్‌, జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

పవన్‌కళ్యాణ్‌ మాట్లాడుతూ ‘‘చిత్ర పరిశ్రమకు రాజకీయాలు ఇమడవు. ఇది కళాకారులు కలిసే ప్రాంతం. నిజమైన కళాకారుడికి, కులం, మతం, ప్రాంతం ఉండవు. చెన్నై నుంచి హైదరాబాద్‌ వచ్చిన తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్థికి ఎందరో కృషి చేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుగారి నాయకత్వంలో ఆ బంధం మరింత బలపడుతుంది. ఆయన అందిస్తున్న తోడ్పాటుకు ధన్యవాదాలు. చిత్ర పరిశ్రమకు ఏ అవసరమున్నా తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌గారు నేనున్నాను అంటూ ముందుకొస్తారు. జన జీవితంలో ఉన్నప్పటికీ సినిమానే అన్నం పెట్టింది. సినిమా లేకపోతే ప్రజాసేవలో ఉండేవాడిని కాదు. సినిమా మాధ్యమం ఇంతమంది అభిమానులను నాకు భిక్షగా ఇచ్చింది. ఇంతమంది నన్ను గుండెల్లో పెట్టుకునేలా చేసింది. ఏదో అయిపోదామని ఎప్పుడూ అనుకోలేదు. మన రాష్ట్రానికి, మనవాళ్లకు ఎంతో కొంత చేయాలని వచ్చా. రాజకీయాల్లో ఉన్నా కదాని, ఎలాగోలా సినిమా చేయలేదు. చాలా బాధ్యతతో సినిమాలు చేస్తున్నా. ‘తొలిప్రేమ’, ‘ఖుషి’ చిత్రాలకు ఎలాంటి క్రమశిక్షణతో పనిచేశామో దీనికి అలాగే పనిచేశాం. ‘అహంకారానికి, ఆత్మగౌరవానికి ఒక మడమ తిప్పని యుద్థం’ ఈ చిత్రం. ఒక పోలీస్‌ ఆఫీసర్‌కు, రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తికి మధ్య జరిగే సంఘర్షణ. తెలుగువారికి చేరువయ్యేలా తీర్చిదిద్దిన త్రివిక్రమ్‌గారికి థ్యాంక్స్‌. ఆయన లేకపోతే ఈ సినిమా లేదు. నా రాజకీయ షెడ్యూల్‌కు అనుగుణంగా నిర్మాతలు చిత్రానికి ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు. ప్రతి టెక్నీషియన్‌ చాలా కష్టపడి పనిచేశారు…అని అన్నారు.

చాలామంది స్టార్స్‌తో చేశా.. కానీ పవన్‌కల్యాణ్‌ డిఫరెంట్‌: రానా

రానా మాట్లాడుతూ ‘‘యాక్టర్‌ అయ్యి 12 ఏళ్లు అయింది. దర్శకులు చెప్పినట్లు నాకు ఇచ్చిన పాత్రలన్నీ చేసుకెళ్లిపోయాను. ఏదోలా యాక్టర్‌ అయ్యా. కానీ హీరో ఎలా అవ్వాలనే కాన్సెప్ట్‌ బుర్రలో తిరుగుతూనే ఉంది. అప్పుడు నా కళ్ల ముందుకొచ్చిన హీరో…. పవన్‌కల్యాణ్‌. ఇండియాలో చాలామంది స్టార్‌లతో కలిసి చేశాను కానీ.. అందులో పవన్‌ కల్యాణ్‌ డిఫరెంట్‌. ఇప్పటి వరకే నేను చేసిన సినిమాలు ఒకలా ఉంటే ఇప్పుడు రాబోయే చిత్రాలన్నీ పవన్‌కల్యాణ్‌ ప్రభావంతో కొత్తగా ఉంటాయి అని అన్నారు.

పవన్‌ క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదు: తలసాని శ్రీనివాస యాదవ్‌‘‘

24 ఏళ్ల క్రితం పవన్‌కల్యాణ్‌ ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పుడు ఎంత క్రేజ్‌ ఉందో.. ఇప్పుడూ అంతే ఉంది. రోజురోజుకీ ఆయన క్రేజ్‌ పెరుగుతుందే కానీ తగ్గడం లేదు. .అని అన్నారు.

గెలుపంటే మోజు లేని వ్యక్తి ఆయన: సాగర్‌ చంద్ర

దర్శకుడు సాగర్‌ కె.చంద్ర మాట్లాడుతూ ‘‘నల్గొండ నుంచి దర్శకుడి కావాలని వచ్చాను. నా కుటుంబ సభ్యుల అండతో ముందుకెళ్తున్నాను. 2011లో ఇండస్ట్రీలో అడుగుపెట్టి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేరా. అదే సమయంలో ‘పంజా ఆడియో ఫంక్షన్‌ పాస్‌ సంపాదించి కల్యాణ్‌గారిని చూడొచ్చు అని గచ్బిబౌలి స్టేడియంకు వెళ్లా. పాస్‌ ఉన్నా… మూడు సార్లు బయటకు తోసేశారు. ఆ స్టేజ్‌ నుంచి ఆయన్ని డైరెక్ట్‌ చేసే ఛాన్స్‌ వచ్చింది. అదంతా నా చుట్టూ ఉన్న మంచి వాళ్ల వల్లే సాధ్యమైంది. రానా గురించి చిన్న మాటలో చెప్పలేను. గొప్ప నటుడు అని చెప్పగలను. ఎప్పుడూ ఒకటే ఎనర్జీతో ఉంటారు. నాగవంశీగారు నన్ను పిలిచి అవకాశం ఇచ్చారు. చినబాబుగారి కుటుంబం నాకు ఆత్మీయులు. త్రివిక్రమ్‌గారు లేకుండా ఈ సినిమా లేదు. ఇండస్ట్రీలో అతి కొద్ది మంది దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నా. కానీ త్రివిక్రమ్‌గారి దగ్గర చాలా నేర్చుకున్నా. .అని అన్నారు.

కార్యక్రమంలో కాసర్ల శ్యామ్‌, మొగిలయ్య ,సంయుక్త మీనన్‌, తమన్‌ , మాగంటి గోపీనాథ్‌, దానం నాగేందర్‌ , సముద్రఖని, మొగిలయ్య, డాన్స్‌ మాస్టర్లు విజయ్‌, గణేష్‌. ఆర్ట్‌ డైరెక్టర్‌ ఎ.ఎస్‌.ప్రకాష్‌, రామ్‌జోగయ్య శాస్ట్రి,, రామ్‌ మిరియాల తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ వార్తల కోసం: https://www.vaartha.com/telangana/