తెలంగాణలో ఈనెల 23న భారత్ జోడో యాత్ర

Bharat Jodo Yatra on 23rd of this month in Telangana

న్యూఢిల్లీః ఈనెల 23న తెలంగాణలోకి కాంగ్రెస్ నేత రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఎంటర్ కానుంది. రాష్ట్రంలో 15 రోజులు ఈ యాత్ర కొనసాగనుంది. ఈనెల 24, 25 వచ్చే నెల 3 తేదీల్లో యాత్రకు బ్రేక్ ఇవ్వనున్నారు. రాష్ట్రంలో రాహుల్ 375 కిలోమీటర్లు నడవనున్నారు. గ్రేటర్ హైదరాబాద్ లోనే 60కిలో మీటర్ల మేర పాదయాత్ర ఉంటుంది. రాష్ట్రంలో రాహుల్ యాత్ర విజయవంతం కోసం 10 ప్రత్యేక కమిటీలను వేయాలని పీసీసీ నిర్ణయించింది. అలంకరణ కమిటీ, ట్రాఫిక్ క్లియరెన్స్–పార్కింగ్ కమిటీ, మౌళిక వసతుల కమిటీ, ఫుడ్–వాటర్ మేనేజ్మెంట్ కమిటీ, మీడియా మేనేజ్మెంట్ కమిటీ, గార్బేజ్ కమిటీ, పబ్లిక్ మొబిలైజేషన్ కమిటీ, రూట్ కో ఆర్డినేషన్ కమిటీ, కల్చరల్ ఆక్టివిటీ కమిటీ, క్రౌడ్ మేనేజ్మెంట్ కమిటీలకు ఒకటి, రెండు రోజుల్లో బాధ్యులను నియమించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రాహుల్ పాదయాత్రపై విస్తృత చర్చ జరిగేలా పీసీసీ ప్లాన్ చేసింది. పాదయాత్ర జరిగే మార్గంలోనే కాకుండా ఇతర గ్రామాల్లో చర్చ జరిగేలా, వాల్ పెయింట్, పోస్టర్లు, కరపత్రాలు, హోర్డింగులు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సాంస్కృతిక కార్యక్రమాలు, కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఏర్పాటు చేయాలని డిసైడైంది.

రాహుల్ ఈ నెల 23న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని మక్తల్ దగ్గర కృష్ణా నది బ్రిడ్జి మీదుగా తెలంగాణాలో అడుగుపెట్టనున్నారు. మక్తల్ నియోజకవర్గం నుండి దేవరకద్ర, మహబూబ్ నగర్ టౌన్, జడ్చర్ల, షాద్ నగర్ టౌన్ మీదుగా శంషాబాద్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి ఆరాంఘర్ మీదుగా ఓల్డ్ సిటీలోకి యాత్ర ప్రవేశిస్తుంది. బహదూర్ పూర, చార్మినార్, అఫ్జల్ గంజ్, ఎంజే మార్కెట్, గాంధీ భవన్, రవీంద్ర భారతి మీదుగా నెక్లెస్ రోడ్డులోని ఇందిరా గాంధీ విగ్రహం వరకు చేరుతుంది. ఇందిరా విగ్రహానికి నివాళులర్పించి వర్ధంతి సభలో రాహుల్ ప్రసంగిస్తారు. ఇక అక్కడి నుండి బోయినపల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్, బాలానగర్, మూసాపేట జంక్షన్, కూకట్ పల్లి, మియాపూర్, పటాన్ చెరు, ముత్తంగి, సంగారెడ్డి క్రాస్ రోడ్, జోగిపేట శంకరం పేట్, మద్దూర్ మీదుగా నాందేడ్ కు వెళ్తారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/