మధ్యప్రదేశ్‌లోకి ప్రవేశించిన భారత్‌ జోడో యాత్ర : రాహుల్

bharat-jodo-yatra-enters-madhya-pradesh

న్యూఢిల్లీః కాంగ్రెస్ నేత రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర.. బుధవారం మధ్యప్రదేశ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. రెండ్రోజుల విరామం తర్వాత.. బుధవారం ఉదయం నుంచి బుర్హాన్‌పూర్‌ నుంచి భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. మహారాష్ట్ర సరిహద్దులో మధ్యప్రదేశ్ లోకి ప్రవేశించేముందు బొడెర్లీ దగ్గర.. కాంగ్రెస్‌ నేత కమల్‌నాథ్‌.. రాహుల్‌ గాంధీకు త్రివర్ణ పతాకాన్ని అందించారు. బుర్హాన్‌పూర్ జిల్లాలోని బోదర్లీ నుంచి రాహుల్ యాత్ర ప్రారంభమైంది. కమల్‌నాథ్‌ సహా పలువురు అగ్రనేతలు, పెద్దసంఖ్యలో కాంగ్రెస్‌ కార్యకర్తలు, స్థానికులు రాహుల్‌ వెంట నడుస్తున్నారు. రాహుల్ 77రోజులుగా పాదయాత్ర చేస్తున్నారు. తమిళనాడు కన్యాకుమారిలో సెప్టెంబర్ 7న ప్రారంభమైన భారత్ జోడో యాత్ర.. కేరళ, కర్ణాటక, ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర మీదుగా కొనసాగి మధ్యప్రదేశ్‌లోకి అడుగుపెట్టింది. ఎంపీలో రాహుల్ భారత్ జోడో యాత్ర 7 జిల్లాల్లో 12రోజుల పాటు కొనసాగనుంది. ఆ తర్వాత రాజస్థాన్‌లోకి భారత్ జోడో యాత్ర ప్రవేశించనుంది.

ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. సమాజంలో వ్యాప్తి చెందుతున్న ద్వేషం, హింస, భయాలకు వ్యతిరేకంగా తమ ప్రచారం కొనసాగుతుందన్నారు. కన్యాకుమారి నుంచి త్రివర్ణ పతాకాన్ని చేతుల్లోకి తీసుకుని భారత్ జోడో యాత్రను ప్రారంభించామని.. ఈ త్రివర్ణ పతాకాన్ని శ్రీనగర్‌కు చేరుకోకుండా ఎవరూ ఆపలేరన్నారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం సమస్యలపై కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్న రాహుల్ గాంధీ.. బిజెపి మొదట యువత, రైతులు, కార్మికుల మనస్సులలో భయాన్ని వ్యాప్తి చేసిందని మండిపడ్డారు. హింసను ప్రేరేపిస్తుందని ఆరోపించారు. దేశంలోని పరిశ్రమలు, విమానాశ్రయాలు, ఓడరేవులు కేవలం ముగ్గురు-నలుగురు పారిశ్రామికవేత్తల చేతుల్లోనే ఉన్నాయన్నారు.

మధ్యప్రదేశ్‌లో యాత్రను స్వాగతించిన మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్.. రాష్ట్రంలో భారత్ జోడో యాత్ర విజయవంతమవుతుందని పేర్కొన్నారు. కాగా, రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక గాంధీ వాద్రా.. గురువారం, శుక్రవారం బుర్హాన్‌పూర్-ఇండోర్ మధ్య జరిగే యాత్రలో పాల్గొంటారని కమల్ నాథ్ తెలిపారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎంపీలో జరిగే యాత్ర కోసం కాంగ్రెస్ విస్తృత ఏర్పాట్లు చేసింది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/