వచ్చే ఏడాదిలో కోవాగ్జిన్‌ అందుబాటులోకి

30 కేంద్రాల్లో కొవాగ్జిన్ మూడవ విడత ట్రయల్స్

Bharat Biotech’s COVID-19

న్యూఢిల్లీ: మూడవ దశ కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ విజయవంతం అయి, ప్రభుత్వం నుంచి అనుమతులు వస్తే, వచ్చే సంవత్సరం ఏప్రిల్, జూన్ మధ్య కాలంలో కోవాగ్జిన్ ప్రజలకు అందుబాటులోకి వస్తుందని భారత్ బయోటెక్ ప్రకటించింది. ఈ మేరకు సంస్థ అంతర్జాతీయ వ్యవహారాల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి ప్రసాద్ కీలక ప్రకటన చేశారు. దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల్లో 25 నుంచి 30 కేంద్రాల్లో థర్డ్ స్టేజ్ పరీక్షలను జరిపించనున్నామని, ఇందుకోసం ఒక్కో కేంద్రంలో 2 వేల మందిని నియమించుకున్నామని ఆయన స్పష్టం చేశారు.

మూడవ దశ ప్రయోగాల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుని, విజయవంతంగా పూర్తి చేయడంపైనే దృష్టిని సారించామని, బలమైన ప్రయోగాత్మక సాక్ష్యాల ఏర్పాటు, వ్యాక్సిన్ సామర్థ్యం, సమాచార భద్రత తదితరాలే ఈ దశలో కీలకమని అన్నారు. భారత నియంత్రణ సంస్థల అనుమతి లభిస్తే, 2021 రెండో త్రైమాసికంలో వ్యాక్సిన్ బయటకు వస్తుందని స్పష్టం చేశారు.

ఇక వ్యాక్సిన్ ను భారీ ఎత్తున తయారు చేసేందుకు అవసరమైన మౌలిక వసతుల కోసం రూ. 350 కోట్ల నుంచి రూ. 400 కోట్లను ఇన్వెస్ట్ చేయనున్నామని స్పష్టం చేసిన ఆయన, ప్రభుత్వంతో పాటు ప్రైవేటు కంపెనీలకు కూడా టీకాను అందిస్తామని తెలిపారు. టీకా ఎగుమతి విషయంలో పలు దేశాల ఫార్మా కంపెనీలతో ప్రస్తుతం ప్రాథమిక చర్చలు సాగుతున్నాయని తెలిపారు. అయితే, టీకా ఎగుమతి విషయమై ఇప్పటివరకూ ఎటువంటి నిర్ణయాలనూ తమ సంస్థ తీసుకోలేదని సాయి ప్రసాద్ స్పష్టం చేశారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/