టీకా ఎవరు తీసుకోరాదో తెలియజేసిన భారత్‌ బయోటెక్‌

ఫ్యాక్ట్ షీట్ ను విడుదల చేసిన భారత్ బయోటెక్

హైదరాబాద్‌: కోవాగ్జిన్‌ టీకాపై విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే భారత్‌ బయోటెక్‌ ఫార్మా సంస్థ ఫ్యాక్ట్ షీట్‌ను రిలీజ్ చేసింది. తాజాగా రిలీజ్ చేసిన మార్గ‌ద‌ర్శ‌కాల్లో.. ఎవ‌రు టీకా తీసుకోవాలి, ఎవ‌రు తీసుకోవ‌ద్దు అన్న అంశంపై క్లారిటీ ఇచ్చింది. కరోనా టీకా తీసుకున్న వారిలో దాదాపు 580 మంది తీవ్రమైన దుష్ప్రభావాలకు గురికాగా, ఇద్దరు మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీకాకు ఎవరు దూరంగా ఉండాలన్న విషయాన్ని భారత్ బయోటెక్ ప్రకటించింది. గతంలో అలర్జీలు ఉన్నవారు, రక్త హీనత, గర్భవతులు, బిడ్డలకు పాలిచ్చే తల్లులు, తీవ్రమైన ఆనారోగ్య సమస్యలు ఉన్నవారు కొవాగ్జిన్ ను తీసుకోవద్దని సలహా ఇచ్చింది.

ఇదే సమయంలో కొవాగ్జిన్ కాకుండా మరో వేరియంట్ ను తీసుకున్న వారు, శరీరంలోని వ్యాధి నిరోధక శక్తిపై ప్రభావం చూపించే మందులను వాడుతున్న వారు, జ్వరంతో బాధపడుతున్న వారు కూడా టీకాకు దూరంగా ఉండాలని సూచించింది. ఇక వ్యాక్సిన్ తీసుకునే ముందు తమ మెడికల్ హిస్టరీని గురించి వైద్యులకు, వ్యాక్సిన్ ఆఫీసర్ లకు తప్పనిసరిగా తెలియజేయాలని, వారి సలహా, సూచనల మేరకు నడచుకోవాలని కోరింది. కోవాగ్జిన్ టీకా వ‌ల్ల క‌లిగే సైడ్ ఎఫెక్ట్స్ గురించి త‌న ఫ్యాక్ట్ షీట్ లిస్టులో భార‌త్ బ‌యోటెక్ కంపెనీ కొన్ని అంశాలు వెల్ల‌డించింది.  టీకా తీసుకున్న ప్రాంతంలో నొప్పి, వాపు, దుర‌ద వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయి.  వ‌ళ్లు నొప్పులు, త‌ల‌నొప్పి, జ్వ‌రం, బ‌ల‌హీన‌త‌, ద‌ద్దులు, న‌ల‌త‌, వాంతులు వ‌చ్చే అవ‌కాశాలు కూడా ఉన్నాయి.  కోవాగ్జిన్ వ‌ల్ల అల‌ర్జీ రియాక్ష‌న్ ఏర్ప‌డే ప్ర‌మాదం ఉన్న దృష్ట్యా.. టీకా తీసుకున్న త‌ర్వాత ఓ అర‌గంట పాటు వ్యాక్సిన్ సెంట‌ర్‌లోనే ఉండాల‌ని భార‌త్ బ‌యోటెక్ సంస్థ సూచ‌న‌లు చేసింది.  త‌మ కంపెనీకి చెందిన రెండ‌వ డోసు టీకా తీసుకున్న త‌ర్వాత‌.. మూడు నెల‌ల పాటు ఫాలోప్ ఉంటుంద‌ని భార‌త్ బ‌యోటెక్ వెల్ల‌డించింది.  

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/