ప్రశాంతంగా కొనసాగుతున్న బంద్‌

వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్

bharat-bandh-continues-in-Telugu-states
Bharat Bandh continues in Andhra Pradesh and telangana

హైదరాబాద్‌: కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ రైతు సంఘాలు ఈరోజు తలపెట్టిన దేశావ్యాప్త బంద్‌ తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతుంది. నిజానికి ఉదయం 11 గంటల నుంచి బంద్ ప్రారంభం అవుతుందని చెప్పినప్పటికీ ఉదయం నుంచే దుకాణాలు మూతపడ్డాయి. బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ వద్ద కాంగ్రెస్, వామపక్ష పార్టీల నేతలు నిరసన తెలుపుతున్నారు. సీపీఐ, సీపీఎం నేతలుు రామకృష్ణ, మధు ఇతర నేతలు బస్టాండ్ ఎదుట బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. బంద్ నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. గుంటూరు జిల్లాలోనూ బంద్ కొనసాగుతోంది. 1200కుపైగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఆటోలు, ఇతర ప్రజా రవాణా వాహనాలను నిరసనకారులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. కర్నూలు, విజయనగరం, విశాఖపట్టణం జిల్లాలోనూ నిరసన కొనసాగుతోంది.

తెలంగాణలోనూ బంద్ జరుగుతోంది. కాంగ్రెస్, టీడీపీ, వామపక్ష నేతలు బంద్‌లో పాల్గొన్నారు. హైదరాబాద్‌లో అఖిలపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా బస్సు సర్వీసులు నిలిచిపోయాయి. ఆర్టీసీ డిపోల ఎదుట టిఆర్‌ఎస్‌, కాంగ్రెస్, వామపక్ష నేతలు బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మేడ్చల్ డిపోలో 186 బస్సులు డిపోకే పరిమితం కాగా, ఆదిలాబాద్ జిల్లాలో ఆరు డిపోల పరిధిలో 600 బస్సులు నిలిచిపోయాయి.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/