భగత్‌సింగ్‌, సుఖ్‌దేవ్‌లకు భారతరత్న ఇవ్వాలి: తివారి

manish tiwari
manish tiwari

న్యూఢిల్లీ: బ్రిటిష్‌ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన స్వాతంత్య్ర సమరయోధులు భగత్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లకు భారత అత్యున్నత పౌర పురస్కారం భారత రత్న ప్రకటించాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎంపి మనీష్‌ తివారి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కోరారు. వారు చేసిన పోరాటం జాతికి స్ఫూర్తిదాయకంగా ఉంటుందని మోడీకి రాసిన లేఖలో తివారి పేర్కొన్నారు. బ్రిటిష్‌ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన స్వాతంత్య్ర సమరయోధులు భగత్‌సింగ్‌, రాజ్‌గురు,సుఖ్‌దేవ్‌ల ప్రాణత్యాగం జాతియావత్తులో జాతీయ భావాన్ని రగులుస్తూ నిరంతరం స్ఫూర్తినిస్తుందన్నారు. 1931, మార్చి 23న వారు ప్రాణత్యాగం చేశారని తివారి వ్యాఖ్యానించారు. 2020, జనవరి 26న ఈ ముగ్గురు స్వాతంత్య్ర సమరయోధులకు భారతరత్న పురస్కారం ప్రకటించినట్లయితే అధికారికంగా షాహిద్‌ ఈ అజమ్‌గా గౌరవించినట్లవుతుందన్నారు. మొహాలీలోని చండీగఢ్‌ ఎయిర్‌పోర్టుకు షాహిద్‌ ఈ అజమ్‌ భగత్‌ సింగ్‌ అని నామకరణం చేయడం జరిగింది. ఇది 126 కోట్ల భారతీయులను తాకిందని ఆయన అన్నారు. ఇంతకుముందు ఎఐఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ కూడా భగత్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లకు భారతరత్న ప్రకటించాలన్నారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.. https://www.vaartha.com/news/international-news/