మునుగోడు ఉప ఎన్నిక ఫలితాల ఫై జోరుగా బెట్టింగులు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు , దేశ వ్యాప్తంగా కూడా మునుగోడు ఉప ఎన్నిక ఫలితం కోసం ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు. ఈ ఎన్నికను మూడు ప్రధాన పార్టీ లు టిఆర్ఎస్ , బిజెపి , కాంగ్రెస్ లు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దాదాపు నెల రోజుల పాటు మునుగోడు లో పర్యటించి ఓటర్లను ఆకట్టుకున్నారు. అలాగే భారీ ఎత్తున ఖర్చు కూడా చేసారు. దీంతో ఈ ఫలితం ఫై అంతటా ఆసక్తి నెలకొని ఉంది. మరోపక్క మునుగోడు బైపోల్ రిజల్ట్పై జోరుగా బెట్టింగులు నడుస్తున్నాయి.

టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల గెలుపుపై వేల నుంచి లక్షల్లో పందాలు కాస్తున్నారు. ఇందుకోసం బుకీలు ప్రత్యేకంగా ఏజెంట్లను నియమించుకున్నారు. ఐపీఎల్ తరహాలో వారిని రంగంలోకి దించి బెట్టింగులను ప్రోత్సహిస్తున్నారు. హైదరాబాద్లోని పలు హోటళ్లలో రూమ్లు అద్దెకు తీసుకొని బెట్టింగులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఏపీలోని గుంటూరు, విజయవాడ, వైజాగ్లో ఏజెంట్లను నియమించుకొని బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. టీఆర్‌ఎస్‌కు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉండడంతో సుమారు రూ.800 నుంచి రూ.1000 కోట్లు టీఆర్‌ఎస్‌వైపు బెట్టింగు కట్టగా, బీజేపీ వైపు రూ.500 కోట్లు కాసినట్టు తెలిసింది. కాంగ్రెస్‌పై పెద్దగా బెట్టింగ్‌ కాయలేదని తెలిసింది. బిజెపి , టిఆర్ఎస్ లపై రూ.1500 కోట్లవరకూ బెట్టింగులు కట్టినట్టు సమాచారం. నిర్వాహకులకు ఏడు నుంచి 10 శాతం వరకు కమీషన్‌ వస్తుందని, అంటే దాదాపు రూ.100 నుంచి 150 కోట్ల వరకు వారు లాభపడుతారని తెలుస్తుంది.