మనకు మంచి రోజులు వస్తాయి – కేసీఆర్

కొంతమంది నాయకులు బీఆర్‌ఎస్‌ను వీడినంత మాత్రాన పార్టీకి ఎలాంటి నష్టం లేదని పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. ఎవరూ అధైర్యపడాల్సిన పనిలేదని, పార్టీకి తిరిగి మంచిరోజులు వస్తాయని భరోసా ఇచ్చారు. పలువురు మాజీ మంత్రులు, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు మంగళవారం ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌లో కేసీఆర్‌ను కలిశారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఆయన వారితో చర్చించారు. అనంతరం వారితో మాట్లాడుతూ.. పార్టీ తొలినాళ్ల నుంచి అనేకమంది అనేక విధాలుగా అవమానాలకు, అవహేళనలకు గురిచేసినా బీఆర్‌ఎస్‌ ముందుకు సాగిన తీరును వివరించినట్టు సమాచారం. 2004 అనంతరం రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఎదురైన పరిస్థితులు, అనంతరం చోటుచేసుకున్న పరిణామాలను ఆయన ఉదహరించినట్టు పార్టీ నేతలు తెలిపారు. పార్టీ నుంచి కొందరు వెళ్లిపోయినంత మాత్రాన ఏదో జరుగుతుందని భయపడాల్సిన పనిలేదని ఆయన వారికి భరోసా ఇచ్చినట్టు సమాచారం. వైఎస్‌ హయాంలో ఇలాంటివి ఎన్ని జరిగినా భయపడలేదని వారికి గుర్తుచేసినట్టు తెలిసింది.