బెంగళూరులో మాస్క్ తప్పనిసరి చేసిన ప్రభుత్వం

బెంగళూరులో రోజుకు 200కు పైగా కొత్త కేసులు

బెంగళూరు: దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. క్రియాశీల కేసుల సంఖ్య నిన్న 25 వేలు దాటడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు, కర్ణాటక రాజధాని బెంగళూరులోనూ రోజువారీ కేసుల సంఖ్య పెరుగుతోంది. ప్రతి రోజూ 200కు పైగా కొత్త కేసులు నమోదవుతుండడంతో ప్రజలు మాస్కులు ధరించాలని ప్రభుత్వం కోరింది. అలాగే, ప్రస్తుతం రోజుకు 16 వేల పరీక్షలు చేస్తుండగా దానిని 20 వేలకు పెంచాలని, అలాగే, ప్రైవేటు ల్యాబుల్లో రోజుకు 4 వేల మందికి పరీక్షలు చేయాలని చీఫ్ కమిషనర్ తుషార్ గిరినాథ్ తమను కోరినట్టు బెంగళూరు మహానగర్ పాలికె డాక్టర్ హరీష్ కుమార్ తెలిపారు.

అలాగే, మాల్స్‌ సహా బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించడంపై ప్రజలకు అవగాహన కల్పించమని కూడా ఆయన తమను ఆదేశించినట్టు చెప్పారు. నేటి నుంచి మార్షల్స్ ద్వారా బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించడంపై ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. కేసులు పెరుగుతున్నప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్ హరీష్ కుమార్ అన్నారు. కాగా, నిన్న కర్ణాటకలో 300 కేసులు నమోదు కాగా, ఒకరు మృతి చెందారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/