అశ్విన్‌పై బెన్‌స్టోక్స్‌ వ్యంగాస్త్రాలు…

జైపూర్‌: ‘మన్కడింగ్‌ ఔట్‌ తో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ కెప్టెన్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌పై ఇంగ్లాండ్‌ స్టార్‌ బౌలర్‌, రాజస్థాన్‌ ఆటగాడు బెన్‌స్టోక్స్‌ వ్యంగాస్త్రాలు సంధించాడు. అంతకుముందు అశ్విన్‌ తీరుపై రాజస్థాన్‌ రాయల్స్‌ మెంటర్‌, ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్‌ షేన్‌వార్న్‌ ట్విట్టర్‌ వేదికగా తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. వరుస ట్వీట్లతో అశ్విన్‌పై విమర్శలు గుప్పించాడు. కెప్టెన్‌గా, వ్యక్తిగతంగా అశ్విన్‌ తనను నిరాశపరిచాడని, ఇది క్రీడాస్పూర్తికి విరుద్ధమని, కెప్టెన్లందరూ క్రీడాస్పూర్తితో ఆడుతామని ఐపిఎల్‌ వాల్‌పై సంతకం చేశారని గుర్తు చేశాడు. అసలు ఆ సమయంలో అశ్విన్‌కు ఆ బంతి వేసే ఆలోచన లేదని….అందుకే బట్లర్‌ను రనౌట్‌ చేశాడని…దాన్ని డెడ్‌బాల్‌గా పరిగణించాల్సి ఉండేదని వార్న్‌ తెలిపాడు. ఐపిఎల్‌ ఇలాంటివి మంచిదికాదని బిసిసిఐని ఉద్దేశిస్తూ ట్వీట్‌ చేశాడు. ఈ విజయం ఆటగాళ్ల మానసిక స్థితిని చెడగొడుతుందని, క్రికెట్‌లో అన్నిటికంటే క్రీడాస్పూర్తే ముఖ్యమని పేర్కొన్నాడు. భావితరాలకు ఆదర్శంగా ఉండాలని షేన్‌ వార్న్‌ సూచించాడు. బెన్‌స్టోక్స్‌ కూడా టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీని అశ్విన్‌లానే ఔట్‌ చేస్తే ఊరుకుంటారా..? అని ప్రశ్నించాడు. అశ్విన్‌ క్రీడా సమగ్రతను కాపాడుతాడనుకుంటే నిరాశపరిచానడి…ఈ ఘటనపై బిసిసిఐ తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నట్లు షేన్‌ వార్న్‌ మరో ట్వీట్‌ ప్రస్తావించాడు.అయితే షేన్‌ వార్న్‌ బెన్‌స్టోక్స్‌ పేరు ప్రస్తావించడంతో ఈ ఇంగ్లీష్‌ పేసర్‌ స్పందించాడు. ప్రపంచకప్‌ ఫైనల్‌ ఆడుతూ..విరాట్‌ కోహ్లీ బ్యాటింగ్‌ చేస్తూ…నేను బౌలింగ్‌ చేస్తుండగా…మన్కడింగ్‌ విధానంలో ఔట్‌ చేసే అవకాశం వచ్చినా నేను చేయను. ఎప్పుడు ఎక్కడా అలా చేయను. నా పేరు ప్రస్తావించారు కాబట్టే ఈ వివరణ ఇస్తున్నానని ట్వీట్‌ చేశాడు. క్రికెట్‌ అభిమానులు సైతం అశ్విన్‌ తీరుపై మండిపడుతున్నారు. నిజానికి అశ్విన్‌ అలా చేయకుంటే కింగ్స్‌ పంజాబ్‌ మ్యాచ్‌ గెలిచి ఉండేది కాదు. అప్పటికే బట్లర్‌ 43 బంతుల్లో 68 పరుగులు చేసి బీకరంగా ఆడుతున్నాడు. బట్లర్‌ ఔట్‌తో రాజస్థాన్‌ 14 పరుగులతో సొంతగడ్డపై పరాజయం పాలైంది.


మరిన్ని తాజా క్రిడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/