కరోనా కారణంగా బేగంబజార్ వ్యాపారులు ఏం చేస్తున్నారంటే!

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ అతివేగంగా విజృంభిస్తుండటంతో, పలు రాష్ట్రాల ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకునేందుకు వెనకాడటం లేదు. దీంతో పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్ విధించేందుకు అధికారులు కసరత్తులు చేస్తున్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో కూడా కరోనా సెకండ్ వేవ్ గతకొద్ది రోజులుగా విజృంభిస్తుంది. దీంతో అధికారులు అప్రమత్తం అవుతున్నారు. ప్రజల్లో మరోసోరి కరోనా అవగాహన పంచేందుకు వారు చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు.

కాగా తెలంగాణలోని హైదరాబాద్ నగరంలోని బేగంబజార్‌లోని పలు మార్కెట్ సంఘాలు కరోనా కట్టడికి తమవంతు ప్రయత్నంగా ముందడుగు వేస్తున్నారు. బేగంబజార్‌ మార్కెట్ అసోసియేషన్ కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు మార్కె్ట్ పని వేళలను నిర్ణయించింది. ఇకపై బేగంబజార్ మార్కెట్ కేవలం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే పనిచేస్తుందని మార్కెట్ అసోసియేషన్ ప్రకటించింది.

దీంతో వ్యాపారస్తులు, వినియోగదారులు ఈ పని వేళల్లో మాత్రమే మార్కెట్‌కు రావాలని వారు సూచించారు. ఇక కరోనా సెకండ్ వేవ్ ప్రభావంతో తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ దేశవ్యాప్తంగా కరోనా కేసులు అధికంగా పెరుగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.