ఎట్టకేలకు దిగొచ్చిన బాసర విద్యార్థులు..నేటి నుండి తరగతులకు హాజరు

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఎట్టకేలకు దిగొచ్చారు. రాత్రి విద్యార్థులతో మంత్రి సబితా జరిపిన చర్చలు సఫలం కావడంతో విద్యార్థులు తమ ఆందోళన విరమించారు. నేటి నుండి తరగతులకు హాజరుకాబోతున్నారు. గత వారం రోజులుగా విద్యార్థులు ఎండా, వాన ను సైతం లెక్క చేయకుండా తమ డిమాండ్స్ ను పరిష్కరించాలంటూ ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ ఆందోళన రోజు రోజు ఉదృతం అవుతుండడం , ప్రతిపక్షాలు ప్రభుత్వం ఫై విమర్శలు చేస్తుండడం తో సీఎం కేసీఆర్ సీరియస్ గా తీసుకున్నారు. నిన్న మంత్రి సబితా పలువురు అధికారులు , ఎమ్మెల్యే లతో చర్చలు జరిపి , రాత్రి క్యాంపస్ కు వెళ్లి విద్యార్థులతో చర్చిలు జరిపారు.

విద్యాలయంలో నెలకొన్న సమస్యలు ఒక్కొక్కటిగా దశలవారీగా పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. 15 రోజుల్లో మరోసారి క్యాంపస్‌ సందర్శిస్తానని తెలిపారు. దాదాపు రెండున్నర గంటలకు పైగా చర్చలు జరిగాయి. చర్చల్లో ట్రిపుల్‌ ఐటీ వీసీ, డైరెక్టర్‌, నిర్మల్‌ కలెక్టర్‌, ఎస్పీ పాల్గొన్నారు. నెల రోజుల్లో సమస్యలన్నీ తీరుస్తానని మంత్రి ఈ సందర్భంగా విద్యార్థులకు హామీ ఇచ్చారు. అయితే, రాతపూర్వకంగా ఇవ్వాలని విద్యార్థులు పట్టుబట్టారు. స్పందించిన సబిత.. మంత్రిని తాను స్వయంగా చెబుతున్నానని, ఇంకా ఎలాంటి హామీ కావాలని ప్రశ్నించారు. అనంతరం బయటకు వచ్చిన విద్యార్థులు ఆందోళన విరమిస్తున్నట్టు ప్రకటించారు. డిమాండ్లు పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారని తెలిపారు. నేటి నుంచి తరగతులకు యథావిధిగా హాజరవుతామని పేర్కొన్నారు.