మరోసారి బాసర ట్రిపుల్ ఐటీ కాలేజీలో 18 మంది విద్యార్థులు అస్వస్థత..

బాసర ట్రిపుల్ ఐటీ కాలేజీలో మరోసారి విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. రీసెంట్ గా ఫుడ్ పాయిజన్ వల్ల పదుల సంఖ్యలో హాస్పటల్ పాలైన సంగతి తెలిసిందే. ఇది ఇంకా మరచిపోకముందే మరోసారి కాలేజీ లో 18 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికావడం మరోసారి మీడియా లో హాట్ టాపిక్ అయ్యింది. మధ్యాహ్న భోజనం తర్వాత విద్యార్థులకు వాంతులు అయినట్లు తెలుస్తోంది. దీంతో విద్యార్థులకు ట్రిపుట్ ఐటీ క్యాంపస్ ఆరోగ్య కేంద్రంలో చికిత్స అందిస్తున్నారు. అయితే ఫుడ్ పాయిజన్ జరిగిందన్న ప్రచారాన్ని ట్రిపుల్ ఐటీ అధికారులు కొట్టి పారేశారు. అటు వైద్యులు కూడా అప్రమత్తమయ్యారు. ఫుడ్ పాయిజన్ వల్ల విద్యార్థులు అస్వస్థతకు గురికాలేదని క్లారిటీ ఇచ్చారు. సీజనల్ వ్యాధులతోనే విద్యార్థులు స్వల్ప అస్వస్థతకు గురయ్యారని చెప్పారు. బాధితుల ఆరోగ్యం నిలకడగా ఉందని…ఆందోళన చెందవద్దని డాక్టర్స్ సూచించారు.

మరోపక్క గత కొద్దీ రోజులుగా హాస్టల్ లో ఫుడ్ సరిగాలేదని..తరుచు ఫుడ్ పాయిజన్ అవుతుందని , హాస్టల్ మెస్ కాంట్రాక్టర్‌ను మార్చాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. యూనిర్సిటీకి పూర్తి స్థాయి వీసీ లేకపోవడంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. ఇంచార్జి వీసీ చర్చలతో ఈ ఆందోళనను విద్యార్థులు విరమించారు. తాజాగా మరోసారి విద్యార్థులు అస్వస్థతకు గురికావడం హాట్ టాపిక్ అవుతుంది.