బాసర ట్రిపుల్ ఐటీలో కొనసాగుతున్న విద్యార్థుల ఆందోళన

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు మరోసారి ఆందోళన బాట పట్టారు. ఫుడ్ పాయిజన్ ఇష్యూ తర్వాత ఇచ్చిన హామీలు అమలు కాలేదంటూ నిరసనకు దిగారు. ఈ1, ఈ2 విద్యార్థులు శనివారం రాత్రి ఆహారం తీసుకోకుండా జాగారం చేసి తమ నిరసన తెలియజేశారు. ఈరోజు ఉదయం కూడా బ్రేక్ ఫాస్ట్ చేయకుండా ఆందోళన కొనసాగిస్తున్నారు. ఇంచార్జ్ వీసీ వచ్చి చర్చలు జరిపినా విద్యార్థులు వెనక్కు తగ్గలేదు. తాము లేవనెత్తిన 5 డిమాండ్లపై క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

ఫుడ్ పాయిజన్ ఇష్యూ తర్వాత ఇచ్చిన హామీలు అమలు కాలేదంటూ వారంతా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఐదు డిమాండ్లపై వీసీ ఇచ్చిన హామీ ఇప్పటికీ నెరవేరలేదని మండిపడుతున్నారు. ఫుడ్ పాయిజన్ ఘటనకు పూర్తి బాధ్యత వహించిన స్టూడెంట్ వెల్ఫేర్ కు చెందిన సిబ్బంది మొత్తం త్వరలో రాజీనామా చేస్తారన్నారని.. అయినా ఎలాంటి చర్యలు తీసుకోలేదంటున్నారు. నాసిరకం భోజనం పెడుతూ తమ ప్రాణాలతో చెలగాటమాడుతున్నా మెస్ కాంట్రాక్టర్‌పై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని స్టూడెంట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెస్ కాంట్రాక్టర్‌ని తొలగించేవరకు తాము వెనక్కి తగ్గేది లేదని హెచ్చరిస్తున్నారు. విద్యార్థుల వరుస ఆందోళనల నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్‌లో పేరెంట్స్ కమిటీ సమావేశం కానుంది. విద్యార్థులకు మేలు చేసేలా కార్యచరణ ప్రకటిస్తామని పేరెంట్స్ కమిటీ సభ్యులు చెబుతున్నారు.