ఆర్ధికవృద్ధిలో భారత్‌ కంటే బంగ్లాదేశ్‌ మెరుగు!

Indian financial
Indian financial


న్యూఢిల్లీ: మందగిస్తున్న ఆర్థిక వ్యవస్థతతో కేంద్రప్రభుత్వం అనేక విమర్శలు ఎదుర్కొంటున్నది. ఈ నేపథ్యంలో మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా ఏషియా డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ విడుదల చేసిన వృద్ధిరేట్లు భారత్‌ను ఆందోళన గురిచేసే విధంగా ఉన్నాయి. భారత్‌ కంటే బంగ్లాదేశ్‌ ఆర్థిక వృద్ధి మెరుగ్గా ఉందని ఏషియా డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ గణాంకాలను విడుదల చేసింది. ద్రవ్యోల్బణం స్థిరంగా ఉంచుతూనే వృద్ధిరేటును బంగ్లాదేశ్‌ క్రమంగా పెంచుకుంటూ పోతోందని నివేదిక వెల్లడించింది. 2016లో బంగ్లాదేశ్‌ వృద్ధిరేటు 7 శాతం ఉండగా ఈ ఆర్థిక సంవత్సరంలో 8 శాతానికి చేరుకుంటుందని ఏషియా డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ అంచనా వేస్తున్నది. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఉన్న దేశాల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఏషియా డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ వివరించింది. 2016లో భారత వృద్ధిరేటు చాలా బాగుండేదని ఆ తరువాత క్రమంగా పడిపోతూ వస్తున్నదని ఏషియా డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ స్పష్టం చేసింది. అమ్మకాలు గణనీయంగా పడిపోతూ, పారిశ్రామిక ఉత్పత్తి తగ్గడంతో భారత్‌ 7 శాతం వృద్ధి రేటు కష్టసాధ్యమని ఏషియా డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ చెపుతున్నది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి భారత్‌ కోలుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని, వృద్ధి రేటు 7.2 శాతానికి చేరుకునే అవకాశాలు ఉన్నాయని ఎడిబి అంచనావేసింది. బంగ్లాదేశ్‌ ఆర్థిక వ్యవస్థకు భారత్‌తో పోలిస్తే వ్యత్యాసం చాలా కనిపిస్తున్నది. భారత్‌ వృద్దిరేటులో సేవారంగం కీలకంగా వ్యవహరిస్తున్నది. అదే భారత్‌లో పారిశ్రామిక రంగంలో వృద్ధిరేటు నిరాశ కలిగిస్తోంది.

బంగ్లాదేశ్‌ పారిశ్రామిక రంగం గణనీయంగా పెరుగుతుండడంతో ఉద్యోగాల కల్పన ఆశాజనకంగా ఉంది. భారత్‌లో అత్యధిక జనాభా వ్యవసాయరంగానికే పరమితమయిందని ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంకు వెల్లడించింది. చాలా మంది వ్యవసాయం వైపు వెళ్లడంతో పారిశ్రామిక రంగంలో మ్యాన్‌ పవర్‌కు కొరత ఏర్పడిందని ఎడిబి తెలిపింది. దాంతో భారత్‌లో ఉద్యోగ కల్పన సవాల్‌గా మారినట్లు ఎడిఇ నివేదిక తెలుపున్నది.అమెరికా చైనా మధ్య నడుస్తున్న వాణిజ్య యుద్ధంతో బంగ్లాదేశ్‌ పరిశ్రమలు బలోపేతమయ్యాయి. దాంతో బంగ్లాదేశ్‌ ఎగుమతులు 2018లో 6.7 శాతం ఉండగా 2019 నాటికి 10.1 శాతానికి పెరిగిందని ఎడిబి నివేదిక పేర్కొంది. 8.8 శాతంగా ఉన్న వస్త్రాల ఎగుమతి ప్రస్తుతం 11.5 చేరిందన్నది. బంగ్లాదేశ్‌ మార్కెట్లకు అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, భారత్‌, జపాన్‌, చైనా, కొరియా వంటి దేశాల నుంచి మంచి డిమాండ్‌ ండటంతో సాధ్యమైందని ఎడిబి నివేదిక చెప్పింది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికీ బంగ్లాదేశ్‌ తనకున్న పరిధిలో వస్తువులను ఎగుమతి చేస్తున్నదని, ఇతర దేశాల్లో తనకంటూ ఒక మార్కెట్‌ను సృష్టించుకుని ఎక్కువ గార్మెంట్స్‌ప ఎగుమతి చేసి భారత్‌ గార్మెంట్‌ రంగాన్ని వెనక్కి నెట్టిందని నివేదిక చెప్పింది. గణాంకాల ప్రకారం భారత్‌ ఎగుమతులు ఏడాదికి సరాసరి 1.5 శాతం పెరిగినట్లు గణాంకాలు చెపుతున్నాయి.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/national/