జనసేన విషయంలో మాట మార్చిన బండ్ల గణేష్

పవన్ కళ్యాణ్ కు వీరభక్తుడు ఎవరంటే ఎవరైనా బండ్ల గణేష్ పేరు చెపుతారు. పవన్ కళ్యాణ్ ను పబ్లిక్ గా దేవుడు అని గణేష్ చెపుతుంటాడు. పవన్ కళ్యాణ్ గురించి ఎవరైన నెగిటివ్ గా మాట్లాడితే అస్సలు ఊరుకోడు. అవతలి వ్యక్తి ఎంతవారైనా సరే గణేష్ సీరియస్ అవుతారు. అలాంటి గణేష్ తాజాగా పవన్ స్థాపించిన జనసేన పార్టీ ఫై రెండు రకాలుగా మాట్లాడడం ఇప్పుడు అందర్నీ షాక్ లో పడేస్తుంది. ప్రస్తుతం గణేష్ మా ఎన్నికల్లో జనరల్ సెక్రెటరీ పదవికి పోటీ చేస్తున్నారు. మొన్నటి వరకు ప్రకాష్ రాజ్ ప్యానల్ లో ఉన్న గణేష్..ఆ ప్యానల్ లోకి జీవిత రాజశేఖర్ రావడం తో వెంటనే బయటకొచ్చిన గణేష్ స్వతంత్రంగా పోటీ చేయబోతున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించారు.

ఈ తరుణంలో ఓ న్యూస్ ఛానల్ డిబేట్ లో పాల్గొన్న గణేష్..జనసేన పార్టీ యొక్క బలాబలాలను ప్రస్తావించారు. ”నేను మొదట నుంచి కాంగ్రెస్ వాదిని. నా కంటే గొప్ప అభిమానులు నాయకులు పవన్ కళ్యాణ్ గారి వెంట ఉన్నారు. ఏపీలో జనసేన స్ట్రాంగ్ గా ఉంది. కానీ తెలంగాణ విషయానికి వస్తే.. ఇక్కడ బెంజి కార్లు ఆడీ కార్లు ఉన్నప్పుడు మారుతి 800 నడపమంటే ఎలా నడుపుతాం?” అని బండ్ల గణేష్ అన్నారు.

”వాస్తవాలు మాట్లాడుకుంటే తెలంగాణలో ఇతర పార్టీల కంటే జనసేన ప్రభావం చాలా తక్కువగా ఉంది. అలాంటి పార్టీని భుజాన వేసుకుని మోయగలిగే శక్తి సామర్థ్యం నాకు లేదు. అయితే పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి కావాలను కోరుకునే వాళ్లలో నేనూ ఒకడిని” అని బండ్ల చెప్పుకొచ్చారు. గణేష్ ఇలా పబ్లిక్ గా జనసేన గురించి తక్కువకే చేసి మాట్లాడేసరికి అభిమానులు కాస్త ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో బండ్ల గణేష్ తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీ భవితవ్యం గురించి ఓ ట్వీట్ చేశారు. ”తెలంగాణ రాష్ట్రంలో కూడా జనసేన ఓ మహాశక్తిగా అవతరించబోతుంది” అని పేర్కొంటూ పవన్ అభిమానులను పార్టీ కార్యకర్తలను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. మొత్తం మీద గణేష్ జనసేన పార్టీ విషయంలో మాట మార్చడం ఇప్పుడు అభిమానులను ఆగ్రహానికి గురి చేస్తుంది.