పాలకుర్తి ప్రభుత్వ ఆస్పత్రిలో బండి సంజయ్ కి వైద్య పరీక్షలు పూర్తి

బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ని పోలీసులు పాలకుర్తి ప్రభుత్వ ఆస్పత్రి తరలించి వైద్య పరీక్షలు అందించారు. అనంతరం మేజిస్ట్రేట్ వద్దకు తీసుకెళ్లనున్నారని తెలుస్తుంది. అర్ధరాత్రి సంజయ్ ని అరెస్ట్ చేసిన పోలీసులు ముందుగా బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఉదయం పది గంటల ప్రాంతంలో కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు మధ్య ఆయన్ను వరంగల్ వైపు తీసుకెళ్లారు. జనగాం సరిహద్దుల్లో వరంగల్ జిల్లా పోలీసులకు అప్పగించారు యాదాద్రి పోలీసులు.

అప్పటి వరకు యాదాద్రి జిల్లా పోలీసులు రక్షణగా ఉండగా.. జనగామ దగ్గర వరంగల్ జిల్లా పోలీస్ వాహనాల్లోకి బండి సంజయ్ ను మార్చారు. బండి సంజయ్ ను వాహనాలు మారుస్తూ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. బొమ్మల రామారం నుంచి వరంగల్ వస్తున్న విషయాన్ని తెలుసుకున్న బీజేపీ కార్యకర్తలు, నేతలు.. మార్గమధ్యలో ఎక్కడికక్కడ కాన్వాయ్ ను అడ్డుకుంటూ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని పసిగట్టిన పోలీసులు.. ఎంపీ బండి సంజయ్ ఏ వాహనంలో ఉన్నారు అనేది తెలియకుండా ఉండేందుకు వాహనాలను మారుస్తూ వచ్చారు. ప్రస్తుతం పాలకుర్తి ప్రభుత్వ హాస్పటల్ లో డాక్టర్లతో వైద్య పరీక్షల తర్వాత.. సంజయ్ ని వర్ధన్నపేట మీదుగా హన్మకొండ కు తరలించారు.