సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ లేఖ

ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని విమర్శలు

హైదరాబాద్ : రాష్ట్రంలో విద్యార్థులకు సంబంధించి రూ.4 వేల కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలంటూ తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం గత రెండేళ్లగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులు విడుదల చేయడంలేదని, తద్వారా 14 లక్షల మంది అనేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని వెల్లడించారు.

ఆర్భాటపు ప్రచారం చేసుకోవడానికి, దేశవ్యాప్తంగా వివిధ పత్రికలు, పలు మాధ్యమాల్లో ప్రకటనలు ఇచ్చుకోవడానికి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం, బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులు విడుదల చేయకపోవడం సవతి తల్లి ప్రేమకు నిదర్శనం అని బండి సంజయ్ విమర్శించారు. ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్ మెంట్ అందకపోవడంతో, ఫీజులు కట్టాలంటూ విద్యార్థులను ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు ఒత్తిడి చేస్తున్నాయని మండిపడ్డారు. అయితే, ఫీజులు కట్టడం కోసం బడుగు బలహీన వర్గాల విద్యార్థులు రక్తాన్ని అమ్ముకుంటున్నారని బండి సంజయ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజులు చెల్లించలేదంటూ ఎంబీఏ, ఇంజినీరింగ్, ఫార్మసీ, ఎంసీఏ, పీజీ, డిగ్రీ, ఎంటెక్ కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడంలేదని, ఫీజులు చెల్లించిన తర్వాతే సర్టిఫికెట్లు ఇస్తామంటున్నారని ఆరోపించారు. ఫీజులు చెల్లించనివారిని క్లాసులకు రానివ్వడంలేదని తెలిపారు.

ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులు విడుదల చేయకపోవడం వల్ల ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు కూడా ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నాయని తెలిపారు. బోధనా సిబ్బందికి వేతనాలు కూడా చెల్లించలేని స్థితిలో విద్యాసంస్థలను నడపడం యాజమాన్యాలకు పెనుభారంగా మారిందని బండి సంజయ్ వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం జూన్ నెలాఖరు నాటికి రూ.4 వేల కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే గాంధేయ పద్ధతిలో బీజేపీ తెలంగాణ శాఖ ఆందోళన కార్యక్రమాలు చేపడుతుందని స్పష్టం చేశారు. విద్యార్థులపై తెలంగాణ ప్రభుత్వం ఇకనైనా సవతి తల్లి ప్రేమను విడనాడాలని కోరారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/