గ్యాంగ్ రేప్ ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ కి బహిరంగ లేఖ రాసిన బండి సంజయ్

రాష్ట్ర వ్యాప్తంగా జూబ్లీ హిల్స్ పబ్ బాలిక అత్యాచార ఘటన సంచలనంగా మారింది. దీని గురించి ఇంతలా మాట్లాడుకోవడానికి కారణం..ఈ అత్యాచార ఘటన వెనుక రాజకీయనేతల కొడుకులు ఉండడమే. వారిని తప్పించి , అమాయకుపు యువకులను ఈ కేసులో ఇరికించాలని ప్రభుత్వం చూస్తుందని ప్రతిపక్ష పార్టీల ఆరోపణ. ఇప్పటికే పలు పార్టీలు పోలీస్ స్టేషన్ లను ముట్టడికి యత్నించగా వారిని అరెస్ట్ చేయడం జరిగింది. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ముఖ్యమంత్రి కేసీఆర్ కు బహిరంగ లేఖ రాసారు.

” మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన వారిలో రాజకీయంగా పలుకుబడి ఉన్న వారు ముఖ్యంగా రాష్ట్ర హోంశాఖ మంత్రి మనువడు, వాక్ఫ్ బోర్డ్ చైర్మన్ కుమారుడు, టిఆర్ఎస్ నాయకుల కుటుంబ సభ్యుల ప్రమేయం ఉన్నట్లు ప్రాథమికంగా ఇప్పటికే మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో అనేక వార్తలు వస్తున్నాయి.

రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు శాఖ హోంమంత్రి కుటుంబ సభ్యుల ప్రమేయంపై స్పష్టత ఇచ్చి, అనుమానాలకు తావు లేకుండా ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని మీరు వెంటనే రాష్ట్ర హోంశాఖ మంత్రిని, పోలీసు శాఖ ఉన్నతాధికారులను ఈ సంఘటన పైన స్పష్టత ఇప్పించాలని బీజేపీ తెలంగాణ శాఖ తరపున కోరుతున్నాం.” అంటూ లేఖలో పేర్కొన్నారు.

ఇక ఈ ఘటన పట్ల రాష్ట్ర హోం మంత్రి మహమూద్ ఆలీ స్పందించారు. నిందితులు ఎవరైనా వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు జరుగుతోందని, ఈ ఘటనలో పోలీసులపై వత్తిడి ఉందన్న ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. వారిపై ఎలాంటి వత్తిడి లేదన్న ఆయన…మైనర్ కావడంతో పోలీసులు వారి పరిధిలో విచారణ జరుపుతున్నారని వెల్లడించారు. కానీ.. ఇలాంటి ఘటనలు జరుగుతుండడం బాధాకరమని హోం మంత్రి మహమూద్ ఆలీ తెలిపారు.