రేపు పామునూర్ నుంచి ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభం

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రేపటి నుండి తిరిగి ప్రారంభం కాబోతుంది. రేపు ఉదయం 8 గంటలకు స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం పామునూర్ నుంచి ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభంకానుంది. కాకపోతే పాదయాత్ర రూట్ మ్యాప్ లో కొన్ని మార్పులు చేర్పులు చేశారు. ఎల్లుండి ఉదయం వరంగల్ భద్రకాళి గుడిలో అమ్మవారిని బండి సంజయ్ దర్శించుకోనున్నారు.

ఈ నెల 27న హన్మకొండ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ లో మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ నిర్వహించనున్నారు. ఈ బహిరంగ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరుకానున్నారు. సభ జరిగే రోజు మధ్యాహ్నం వరకు పాదయాత్ర కొనసాగించనున్న బండి సంజయ్.. నేరుగా బహిరంగ సభకు చేరుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రెండు రోజుల క్రితం బండి సంజయ్ పాదయాత్రను నిలిపివేయాలని పోలీసులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.

పాదయాత్ర పేరుతో బీజేపీ నాయకులు విద్వేషాలు రెచ్చగొడుతున్నారని పోలీసులు పేర్కొన్నారు. ధర్మదీక్ష పేరుతో వివిధ జిల్లాల నుంచి భారీ ఎత్తున జన సమీకరణ చేస్తున్నారని ..రెచ్చగొట్టే ప్రకటనలతో, ఇతర జిల్లాల నుంచి కార్యకర్తలను రప్పిస్తుండటంతో జిల్లాలో శాంతిభద్రతల విఘాతం ఏర్పడే ప్రమాదం ఉందని తెలిపారు. దీంతో బిజెపి హైకోర్టు ను ఆశ్రయించారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు బండి సంజయ్ పాదయాత్రకు అనుమతి ఇచ్చింది. వర్ధన్ పేట్ ACP ఇచ్చిన నోటీసును కోర్టు కొట్టివేసింది.