కేసీఆర్‌ కోసం జిల్లాకో జైలు రెడీ చేశాం – బండి సంజయ్

‘జైలుకెళ్లి వచ్చా.. కేసీఆర్‌కు రూమ్ రెడీ చేసి వచ్చా’ అంటూ హన్మకొండ సభలో బండి సంజయ్ ఘాటైన కామెంట్స్ చేసారు. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నిర్వహించిన మూడో విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర వరంగల్ లో ముగిసింది. ఈ సందర్భంగా హన్మకొండ ఆర్ట్స్ కాలేజీలో భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో బండి సంజయ్ మాట్లాడుతూ..బీజేపీ కార్యకర్తలకు జైళ్లు కొత్త కాదని , ధర్మ రక్షకులు పీడీ యాక్ట్‌లకు భయపడరని అన్నారు.

‘జైలుకెళ్లి వచ్చా.. కేసీఆర్‌కు రూమ్ రెడీ చేసి వచ్చా’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు బండి సంజయ్. ఆంక్షల పేరుతో ప్రభుత్వం ప్రతిసారీ అడ్డుకుంటోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ జిల్లాల్లో బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారని, కేసీఆర్ కోసం ప్రతి జిల్లాకో జైలు రూమ్ రెడీ చేశామన్నారు. సీఎం కేసీఆర్, ఆయన కుటుంబాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని సభ వేదిక ఫై బండి సంజయ్ అన్నారు. తనను అరెస్ట్ చేసినా యాత్ర ఆగలేదన్నారు. యాత్ర పూర్తి చేసి చూపించామన్నారు. మూసీ ప్రక్షాళన ఏమైందని ప్రశ్నించారు. డిండి ప్రాజెక్టు ఏమైందని నిలదీశారు.

ఇక ఇదే సభలో నిజామాబాద్ ఎంపీ అర్వింద్ మాట్లాడుతూ..రాష్ర్టంలో టీఆర్ఎస్ ఎన్ని అడ్డంకులు సృష్టించినా బీజేపీ ఎదుగుదలను ఎవరూ ఆపలేరన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ర్టంలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వమే రాబోతుందని అన్నారు. అలాగే ప్రజలకు పలు ప్రశ్నలు చిందించారు. వరి వేస్తే ఉరి అని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ కావాలా..? 2021 వరకూ కోటి 42 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యాన్ని కొనుగోలు చేసిన ప్రధాని నరేంద్ర మోడీ కావాలా..? అని ప్రశ్నించారు.

భారీ వర్షాలు, వరదలతో పంటలు కొట్టుకుపోతే పట్టించుకోని సీఎం కేసీఆర్ కావాలా..? లేక ఫసల్ బీమా పథకంతో రైతులను ఆదుకుంటున్న మోడీ కావాలా..? నిరుపేదలకు, ఇండ్లు లేని వారికి డబుల్ బెడ్ రూమ్ ఇంట్లు కట్టించి, ఇస్తానని చెప్పి మోసం చేసిన కేసీఆర్ కావాలా..? లేక దేశంలోని నిరుపేద మహిళలకు 3కోట్ల 20లక్షల ఇండ్లు కట్టించి ఇచ్చిన మోడీ కావాలా..? అని అరవింద్ అన్నారు.

కరోనా సమయంలో నిరుపేద, సామాన్య మధ్యతరగతి ప్రజల కోసం ఎటువంటి ఆరోగ్య బీమా పథకాన్ని ప్రవేశపెట్టని సీఎం కేసీఆర్ కావాలా..? లేక 20 కోట్లకు పైగా కుటుంబాలను ఆదుకుంటున్న ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రవేశపెట్టిన మోడీ కావాలా..? అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని అవమాన పర్చి.. కొత్త రాజ్యాంగం కావాలని చెప్పిన కేసీఆర్ కావాలా..? లేక అంబేడ్కర్ రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో అమలు పరుస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ కావాలా..? అంటూ వరుస ప్రశ్నలు చిందించారు.