పీఎఫ్ఐను టీఆర్ఎస్ పెంచి పోషిస్తోంది – బండి సంజయ్

bandi-sanjay-comments-on-cm-kcr

భారత్ ను ఇస్లామిక్ దేశంగా మార్చేందుకు టిఆర్ఎస్ కుట్ర చేస్తుందని , పీఎఫ్ఐ కి టిఆర్ఎస్ నిధులు ఇస్తోందంటూ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2040నాటికి భారత్ ను ఇస్లామిక్ రాజ్యంగా మార్చేందుకు పీఎఫ్ఐ కుట్ర చేస్తోందని..పీఎఫ్ఐ తెలంగాణలో విస్తరిస్తుంటే కేసీఆర్ ఏం చేస్తున్నారు? అంటూ ప్రశ్నించారు బండి సంజయ్. ఉగ్రవాద కార్యక్రమాలు పీఎఫ్ఐ అడ్డాగా మారిందని, ఆసంస్థతో టీఆర్ ఎస్, ఎంఐఎం కలిసి పనిచేస్తున్నాయని విమర్శించారు. వ్యాయామాల పేరుతో పీఎఫ్ఐ దేశ విద్రోహ కార్యక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు. నిషేధించబడిన ఉగ్రవాద సంస్థ సిమి మరో అవతారమే పీఎఫ్ఐ అని బండి సంజయ్ ఆరోపించారు.

ధార్మిక కార్యకలాపాల పేరుతో మత విద్వేషాలు రెచ్చగొట్టడంతో పాటు ఉగ్రవాద కార్యకలాపాల్లో శిక్షణ ఇస్తున్నారంటూ పీఎఫ్‌ఐపై నిజామాబాద్‌లో స్థానిక పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఈ కేసు దర్యాప్తుకు ఎన్‌ఐఏకు బదిలీ చేశారు. దర్యాప్తులో భాగంగా ఎన్‌ఐఏ అధికారులు గతంలోనే ఒకసారి సోదాలు నిర్వహించారు.

రెండు రోజుల క్రితం రెండోసారి రెండు తెలుగు రాష్ట్రాల్లో 40 ప్రాంతాల్లో సోదాలు జరిపారు. పలు పత్రాలు, హార్డ్‌డిస్కులు, నగదు స్వాధీనం చేసుకున్నారు. బోధన్‌కు చెందిన సయ్యద్‌ సమీర్‌, ఆదిలాబాద్‌కు చెందిన ఫిరోజ్‌, జగిత్యాలకు చెందిన మహ్మద్‌ ఇర్ఫాన్‌ అహ్మద్‌, నెల్లూరుకు చెందిన ఎండీ ఉస్మాన్‌లను అరెస్టు చేసి నాంపల్లిలోని నాలుగో అదనపు మున్సిపల్‌ సెషన్స్‌ జడ్జి ఎదుట హాజరుపరిచారు. న్యాయమూర్తి 14 రోజుల రిమాండు విధించడంతో వారిని చంచల్‌గూడా జైలుకు తరలించారు.

ఇక నగరంలో బండి సంజయ్ చేపట్టిన పాదయాత్ర తొమ్మిదవ రోజుకు చేరింది. బుధవారం ఉదయం నాగోల్‌ నుంచి బండి సంజయ్ పాదయాత్ర మొదలైంది. నాగోల్ నుంచి కొత్తపేట కన్యకా పరమేశ్వరీ టెంపుల్, బాబా కాంప్లెక్స్, చైతన్యపురి, వివేకానంద నగర్ బస్సు స్టాప్, పీ&టీ కాలనీ, సరూర్‌నగర్ గాంధీ విగ్రహం, కర్మాన్‌ఘాట్ క్రాస్ రోడ్స్, బైరామల్ గూడా క్రాస్ రోడ్స్, వెంకటరమణ కాలనీ, ఎఫ్సీఐ కాలనీ ఫేస్ – 1, టీవీ కాలనీ బస్సు స్టాప్, ఎన్జీవోస్ కాలనీ వాటర్ ట్యాంక్, వనస్థలిపురం షాపింగ్ కాంప్లెక్స్, గురుద్వార రోడ్, హుడా సాయి నగర్ మీదుగా ఆటోనగర్ వరకు పాదయాత్ర కొనసాగనుంది. ఈరోజు రాత్రి ఆటోనగర్ సమీపంలో బీజేపీ రాష్ట్ర అధినేత బస చేయనున్నారు. ఈరోజు మొత్తం 13.5 కిలోమీటర్ల మేర బండి సంజయ్ పాదయాత్ర కొనసాగనుంది.