జైలు నుంచి బండి సంజయ్ విడుదల

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జైలు నుంచి బయటకువచ్చారు. తెలంగాణ సర్కార్ తీసుకొచ్చిన 317 జీవోను సవరించాలని కరీంనగర్ లో జన జాగరణ దీక్ష చేపట్టారు సంజయ్. అయితే దీక్ష లో కోవిడ్ నిబంధనలు పాటించలేదని ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. దీంతో మూడ్రోజుల పాటు జైల్లో ఉన్న సంజయ్..బుధువారం హైకోర్టు సంజయ్‌ను విడుదల చేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జుడీషియల్ రిమాండ్‌పై హైకోర్టు స్టే విధించి, వ్యక్తిగత పూచీ 40 వేల బాండ్‌పై విడుదల చేయాలని జైళ్ల శాఖ డీజీని హైకోర్టు ఆదేశించింది. దీంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. సంజయ్​ విడుదల నేపథ్యంలో కరీంనగర్‌ జైలు వద్దకు భారీగా భాజపా కార్యకర్తలు తరలివచ్చారు.

జైలు నుండి బయటకు వచ్చిన సంజయ్ మాట్లాడుతూ..ప్రభుత్వం జీవో 317 సవరించినపుడే సంతోషిస్తా. మరోసారి జైలుకు వెళ్లేందుకైనా సిద్ధంగా ఉన్నా. వచ్చే ఎన్నికల్లో భాజపానే అధికారంలోకి వస్తుంది. ఉద్యోగులకు భాజపా పూర్తి అండగా ఉంటుంది. హక్కుల కోసం ఉద్యోగులు చేసే పోరాటానికి అండగా ఉంటాం. ఉద్యోగాలు పోతే అధికారంలోకి వచ్చాక ఇప్పించే బాధ్యత మాది. తెలంగాణ సమాజం, రైతులు, ఉద్యోగుల కోసమే భాజపా పోరాటం. ధర్మయుద్ధం ఇప్పుడే మొదలైందన్నారు. జైలులో మరికొంతమంది భాజపా నాయకులున్నారని ఆయన తెలిపారు. రాష్ట్రంలో రూ.వేల కోట్లు దోచుకుని అవినీతి కుబేరులుగా మారారని ఆరోపించారు. రాష్ట్రంలో తెరాస అధికారంలో ఉంటే.. కేంద్రంలో భాజపా అధికారంలో ఉందన్నారు. అండగా ఉన్న అధినాయకత్వం, కార్యకర్తలకు బండి సంజయ్​ ధన్యవాదాలు తెలిపారు.