అక్బరుద్దీన్ కేసును కావాలనే నీరుగార్చారు – బండి సంజయ్

విద్వేష‌పూరిత వ్యాఖ్య‌లు చేశారంటూ అక్బరుద్దీన్ ఫై న‌మోదైన కేసుల‌ను కొట్టివేస్తూ నాంప‌ల్లి కోర్టు బుధ‌వారం నాడు కీల‌క తీర్పు ఇచ్చింది. ఈ కేసులో అక్బ‌రుద్దీన్‌ను నిర్దోషిగా ప్ర‌క‌టించిన కోర్టు.. ఈ కేసును కొట్టివేస్తున్న‌ట్టు ప్ర‌కటించింది. ఈ ప్రకటన పట్ల బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. అక్బరుద్దీన్ కేసును కావాలనే నీరుగార్చారని.. టీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ కుమ్కక్కు రాజకీయాలకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? అని ఆగ్రహం వ్యక్తం చేసారు.

ప్రజలు ఈ మూడు పార్టీలకు తగిన గుణపాఠం చెప్పడం ఖాయం.. నిర్మల్ కేసుపై తక్షణమే అప్పీల్ కు వెళ్లాలని డిమాండ్ చేశారు. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీపై నమోదైన కేసును న్యాయ స్థానం కొట్టివేయడం విస్మయం కలిగిస్తోందని.. ‘’15 నిమిషాలు సమయమిస్తే హిందువులందరినీ నరికి చంపుతామంటూ అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలను ప్రపంచమంతా చూసింది. విన్నది. అయినా అక్బరుద్దీన్ ను నిర్దోషిగా ప్రకటించడం ఆశ్చర్యం కలుగుతోందన్నారు.

ఉమ్మ‌డి రాష్ట్రంగా ఉన్న స‌మ‌యంలో 2012 డిసెంబ‌ర్ నెలాఖ‌రులో ఆదిలాబాద్‌, నిజామాబాద్ జిల్లాల్లో ప‌ర్య‌టించిన సంద‌ర్భంగా మ‌త విద్వేషాలు రెచ్చ‌గొట్టేలా అక్బ‌రుద్దీన్ ప్ర‌సంగించారంటూ ఆయ‌న‌పై కేసులు న‌మోద‌య్యాయి. ఈ కేసుల్లో 2013లో అరెస్టైన ఓవైసీ.. ఆ త‌ర్వాత బెయిల్ తీసుకుని బ‌య‌ట‌కు వ‌చ్చారు. నాటి నుంచి ఈ కేసును నాంప‌ల్లి కోర్టు విచారిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే ఈ కేసు విచార‌ణ‌ను ముగించిన కోర్టు ఈ నెల 12న తుది తీర్పు వెలువ‌రించ‌నున్న‌ట్లు ప్రకటించింది. అయితే మంగ‌ళ‌వారం నాడు తీర్పును మ‌రోమారు వాయిదా వేసిన కోర్టు.. బుధ‌వారం నాడు త‌న తుది తీర్పును వెలువ‌రించింది.