అమిత్ షా కాళ్లకు చెప్పులు తొడిగిన బండి సంజయ్..?

అమిత్ షా కాళ్లకు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. చెప్పులు తొడిగారా..? ప్రస్తుతం సోషల్ మీడియా లో ఇదే చర్చ నడుస్తుంది. నిన్న ఆదివారం అమిత్ షా..మునుగోడు సభకు హాజరయ్యారు. ముందుగా హైదరాబాద్ కు చేరుకున్న ఆయన సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనం అనంతరం అమిత్ షా బయటకు వస్తుండగా ఆయన వెంటే ఉన్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్..అమిత్ షా కంటే ముందు వెళ్లి ఆయన చెప్పులు తీసి..ఆయన కాళ్ల ముందు పెట్టినట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

దీనిపై టిఆర్ఎస్ సోషల్ మీడియా ఇంఛార్జ్ గుజరాత్ నాయకులకు ఉరికి ఉరికి చెప్పులు తొడగడం తెలంగాణ ఆత్మగౌరవమా..? అంటూ పోస్టు చేయగా.. ఇతర శ్రేణులు ఆ వీడియోను రీట్వీట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. ఈ వీడియో చూసిన తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్వయంగా దీన్ని రీట్వీట్ చేయడంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. అటు కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ సైతం స్పందించారు. బండి సంజయ్ తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారంటూ ఆయన వీడియో విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారుతుండడంతో నెటిజన్లు ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. మరి దీనిపై బండి సంజయ్ ఎలా స్పందిస్తారో చూడాలి.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/